IND vs ENG: 'వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం.. అయినా అతడికి ఛాన్స్ ఇవ్వాల్సిందే'

1 Mar, 2024 20:18 IST|Sakshi
PC: The Cricket Lounge

ఇంగ్లండ్‌తో ఇప్పటికే టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు నామమాత్రపు ఐదో టెస్టుకు సిద్దమవుతోంది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా ఇరు జట్ల మధ్య ఐదో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్‌ ఆటగాడు రజిత్‌ పాటిదార్‌పై వేటు వేయాలని మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వైజాగ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్‌ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఆ తర్వాతి రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ మధ్యప్రదేశ్‌ ఆటగాడు కేవలం 63 పరుగులు చేశాడు.

ఈ క్రమంలోనే పాటిదార్‌ను పక్కన పెట్టాలని మెన్‌జ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పాటిదార్‌కు మద్దతుగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ నిలిచాడు. పాటిదార్‌ అద్భుతమైన ఆటగాడని, అతడికి మరో అవకాశం ఇవ్వాలని ఏబీడీ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లండ్‌ సిరీస్‌లో రజిత్‌ పాటిదార్‌ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. తనకు జీవిత కాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ను ఆడలేకపోయాడు. కానీ ప్రస్తుతం భారత జట్టులో ఉన్న మంచి విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం బాగా ఆడకున్నా ఫలితాలు జట్టుకు అనుకూలంగా వస్తున్నప్పుడు మనం కంటిన్యూ అయ్యే ఛాన్స్‌ ఉంటుంది. 

అతడి అటిట్యూడ్‌ బాగా ఉండి, డ్రెస్సింగ్ రూమ్‌లో అందరికి నచ్చితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మెనెజ్‌మెంట్‌తో మాట్లాడే ఛాన్స్‌ ఉంది. అయితే పాటిదార్‌ మాత్రం అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. ప్రస్తుతానికి అతడు పరుగులేమీ చేయకున్నా అతడికి మరిన్ని అవకాశాలిచ్చి చూడండి తన యూట్యూబ్‌ ఛానల్‌లో డివిలియర్స్‌ పేర్కొన్నాడు.
చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్‌ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలి సారి

whatsapp channel

మరిన్ని వార్తలు