సెక్యూరిటీ గార్డుగా గుజరాత్‌ ప్లేయర్‌ తండ్రి.. సర్‌ప్రైజ్‌ చేసిన గిల్‌! | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ గార్డుగా గుజరాత్‌ ప్లేయర్‌ తండ్రి.. సర్‌ప్రైజ్‌ చేసిన గిల్‌! వీడియో వైరల్‌

Published Thu, Feb 29 2024 6:25 PM

Gill Surprises Gujarat Titans Teammate Father Works As Airport Guard Video - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌.. గుజరాత్‌‌ టైటాన్స్‌కు చెందిన ఓ యువ ప్లేయర్‌ తండ్రిని సర్‌ప్రైజ్‌ చేశాడు. ఎయిర్‌పోర్టు సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న ఆయనను మర్యాదపూర్వకంగా పలకరించి.. కాసేపు ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఎవరా ప్లేయర్‌? అతడి తండ్రి ఎవరు?...

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచి వేదికగా టీమిండియా నాలుగో టెస్టు ఆడింది. ఈ మ్యాచ్‌ విజయంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే పరిమితమైన ఈ పంజాబీ బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం విలువైన అజేయ అర్ధ శతకం(52) బాదాడు.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఓ మ్యాచ్‌ మిగిలి ఉండగానే రోహిత్‌ సేన సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.

ఇదిలా ఉంటే.. రాంచి టెస్టు నేపథ్యంలో స్థానిక బిర్సా ముండా ఎయిర్‌పోర్టుకు వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ ఓ సెక్యూరిటీ గార్డును పలకరించాడు. ఆయన పేరు ఫ్రాన్సిస్‌ జేవియర్‌ మింజ్‌. 

రూ. 20 లక్షలతో వేలంలోకి.. ఏకంగా 3.6 కోట్లు
ఇటీవల ఐపీఎల్‌-2024 మినీ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ ఏకంగా రూ. 3.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన రాబిన్‌ మింజ్‌ తండ్రి ఆయన. ఐపీఎల్‌ వేలం చరిత్రలో అమ్ముడుపోయిన తొలి గిరిజన క్రికెటర్‌గా రాబిన్‌ రికార్డు సాధించాడు.

దేశవాళీ క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సత్తా చాటుతూ రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చి ఏకంగా కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాడు. రాబిన్‌ తండ్రి గతంలో భారత ఆర్మీలో పనిచేశారు. ప్రస్తుతం బిర్సా ముండా ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో రాంచికి వెళ్లిన సందర్భంగా గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఫ్రాన్సిస్‌ జేవియర్‌ మింజ్‌ను పలకరించడం ఆసక్తికరంగా మారింది. కాగా హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్లిపోవడంతో గిల్‌ అతడి స్థానంలో టైటాన్స్‌ సారథిగా నియమితుడైన విషయం తెలిసిందే.

చదవండి: MS Dhoni: అతడిని ఇప్పుడే ధోనితో పోలుస్తారా?: గంగూలీ

Advertisement
Advertisement