మార్చి 22 నుంచి ఐపీఎల్‌ 2024..?

18 Dec, 2023 20:40 IST|Sakshi

సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతున్న కథనాల ప్రకారం ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఈ సీజన్‌ మే చివరి నాటి పూర్తవుతుందని సమాచారం. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికల జరగాల్సి ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాతే తదనుగుణంగా ఐపీఎల్‌ షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్నికల పోలింగ్ తేదీలు ఖరారయ్యాక ఐపీఎల్‌ 2024 షెడ్యూల్‌ విడుదలవుతుందని ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

ఇదిలా ఉంటే, వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్‌ కోసం ఇప్పటినుంచే హడావుడి మొదలైంది. 2024 సీజన్‌ వేలం రేపు (డిసెంబర్‌ 19) జరుగనుండటంతో అన్ని ఫ్రాంచైజీలు సన్నాహకాల్లో నిమగ్నమై ఉన్నాయి. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో రేపు వేలం జరుగనుంది. ఈ వేలం భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమవుతుంది. వేలం ప్రక్రియ మొత్తం స్టార్‌ స్పోర్ట్స్‌ (టీవీ), జియో సినిమాలో (డిజిటల్‌) ప్రత్యక్ష ప్రసారం కానుంది. 

ఈ వేలంలో 77 స్లాట్‌ల కోసం​ 333 మంది ఆటగాళ్లు పోటీపడనున్నారు. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. వేర్వేరు బేస్‌ ప్రైజ్‌ విభాగాల్లో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలంలో మిచెల్‌ స్టార్క్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, పాట్‌ కమిన్స్‌, హ్యారీ బ్రూక్‌, ట్రవిస్‌ హెడ్‌, రచిన్‌ రవీంద్రలపై అందరీ దృష్టి ఉంది. ఈ ఆటగాళ్లు వేలంలో గత రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


 

>
మరిన్ని వార్తలు