IPL 2024 Auction: మల్లికా సాగర్‌కు ‘హ్యామర్‌మ్యాన్‌ విషెస్‌’.. ఫొటో వైరల్‌

18 Dec, 2023 20:56 IST|Sakshi
మల్లికా సాగర్‌ (PC: Jio Cinema)

ఐపీఎల్‌-2024 వేలంలో ఆక్షనీర్‌గా వ్యవహరించనున్న మల్లికా సాగర్‌కు రిచర్డ్‌ మ్యాడ్లే అభినందనలు తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో వేలం నిర్వహణకర్తగా వ్యవహరించే అవకాశం రావడం గొప్ప విషయమని పేర్కొన్నాడు. 

ఆక్షనీర్లకు ఇంతకంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదంటూ హర్షం వ్యక్తం చేశాడు. బీసీసీఐ తనకు అప్పజెప్పిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయాలని మల్లికకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. అదే విధంగా.. ఐపీఎల్‌తో తనకున్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఈ సందర్భంగా అరుదైన ఫొటోను పంచుకున్నాడు. 

కాగా 2008లో మొదలైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గత పదహారేళ్లుగా విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రపంచంలోనే ధనిక టీ20 లీగ్‌గా మారి.. యువ క్రికెటర్ల నుంచి అనుభవజ్ఞుల దాకా అందరిపై కనక వర్షం కురిపిస్తూ ఎంతోమందికి జీవితాన్నిస్తోంది. ఇక ఈ లీగ్‌ అరంగేట్ర వేలంలో ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ మ్యాడ్లే ఆక్షనీర్‌గా వ్యవహరించాడు.

పదేళ్లపాటు తనే ఈ బాధ్యతలు నిర్వర్తించి హ్యామర్‌మాన్‌గా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత హ్యూ ఎడ్మడ్స్‌ ఐపీఎల్‌ ఆక్షనీర్‌గా సేవలు అందించాడు. అయితే, ఇప్పుడు అతడి స్థానాన్ని మల్లికా సాగర్‌ భర్తీ చేయనుంది. తద్వారా ఈ అవకాశం దక్కించుకున్న భారత తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ చరిత్రలో మల్లికా సాగర్‌ ఓవరాల్‌గా నాలుగో ఆక్షనీర్‌.

రిచర్డ్‌ మ్యాడ్లే, ఎడ్మడ్స్‌తో పాటు చారు శర్మ కూడా ఐపీఎల్‌ వేలం నిర్వహించాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలం సందర్భంగా ఎడ్మడ్స్‌ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో ఇండియన్‌ మల్లికా సాగర్‌ ఆక్షనీర్‌గా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనా వేదికగా మంగళవారం ఐపీఎల్‌-2024 వేలం జరుగనుంది.

>
మరిన్ని వార్తలు