IPL 2022: 'అప్పుడు గంభీర్‌.. ఇప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌.. ఈ సారి కప్‌ కోల్‌కతాదే'

4 Apr, 2022 13:00 IST|Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. "శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. 2018 సీజన్‌లో  ఢిల్లీకి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పడు అతడికి అంత అనుభవం లేదు. అయితే ఇప్పుడు అయ్యర్ ఆత్మవిశ్వాసంతో పాటు, అనుభవం వచ్చింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన వ్యూహాలను అయ్యర్‌ రచించాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఉమేష్‌ యాదవ్‌ తొలి వికెట్‌ అందించిన తర్వాత.. మావి చేతికి అయ్యర్‌ బంతి ఇచ్చాడు.

అయితే మావి భారీగా పరుగులు సమర్పించకున్నప్పటికీ.. దూకుడుగా ఆడుతున్న రాజపక్స వికెట్‌ సాధించాడు. అనంతరం వరుణ్ చక్రవర్తితో బౌలింగ్‌ చేయించి పంజాబ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక్కడే మనం శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీ స్కిల్స్‌ను గమనించవచ్చు. అయ్యర్‌ సారథ్యంలోని కేకేఆర్‌ జట్టును ఓడించడం ఇతర జట్టులకు అంత సులభం కాదు. కేకెఆర్ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. 

గౌతమ్ గంభీర్ తర్వాత, శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ జట్టు కచ్చితంగా టైటిల్‌ నెగ్గుతుంది" అని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్‌-2022లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెండు మ్యాచ్‌లో విజయం సాధించింది. కాగా కేకేఆర్‌ తమ తదుపరి మ్యా్‌చ్‌లో ఏప్రిల్‌-6న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

చదవండి: IPL 2022: ఆర్సీబీకి భారీ షాక్‌.. యువ ఆటగాడు దూరం!

మరిన్ని వార్తలు