CWC 2023: కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత రోహిత్‌తో నేను చెప్పిందిదే: గంగూలీ

10 Nov, 2023 17:10 IST|Sakshi

Rohit Sharma- ViratKohli- Team India Captaincy: వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో అజేయంగా ఉండి సెమీస్‌ చేరిన తొలి జట్టుగా నిలిచింది. టైటిల్‌ దిశగా ఒక్కో అడుగు వేస్తూ సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఉంది.

ఇక ఈ ఐసీసీ టోర్నీ కంటే ముందు రోహిత్‌ సేన ఆసియా వన్డే కప్‌-2023 నెగ్గిన విషయం తెలిసిందే. విరాట్‌ కోహ్లి నుంచి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గెలిచిన తొలి టైటిల్‌ ఇది. 

దీంతో.. ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రమే గెలుస్తాడంటూ అప్పటి వరకు రోహిత్‌ను విమర్శించిన వాళ్లకు గట్టిగా బదులిచ్చినట్లయింది. ఈ క్రమంలో స్వదేశంలో ప్రపంచప్‌లో టీమిండియా జైత్రయాత్ర సాగిస్తున్న తీరు, రోహిత్‌ కెప్టెన్సీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించడం విశేషం.

కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత నేనే..
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. రోహిత్‌ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు... ‘‘విరాట్‌ తర్వాత మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ చేపట్టేందుకు రోహిత్‌ శర్మ సిద్ధంగా లేడు.

ఈ విషయం గురించి ఎన్నోసార్లు తనతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నేను మరింత చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ‘‘నువ్వు  సరే అంటావా? లేదంటే నాకు నేనుగా దీని గురించి ప్రకటన చేయాలా? అప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా బాధ్యతలు చేపట్టక తప్పదు’’ అని తనతో కాస్త గట్టిగానే మాట్లాడాను.

ఇదంతా నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు
ఎందుకంటే తను జట్టును విజయవంతంగా ముందుకు నడపగల సమర్థుడని నాకు తెలుసు. నిజానికి విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ వదిలేసిన తర్వాత టీమిండియాను నడిపించే అత్యుత్తమ వ్యక్తి అతడే అని అందరూ నమ్మారు. 

అందుకే ఇప్పుడు జరుగుతున్నదంతా నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు’’ అంటూ రోహిత్‌పై ప్రశంసలు కురిపించాడు. కోల్‌కతా టీవీతో సంభాషిస్తూ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 తర్వాత విరాట్‌ కోహ్లి టీమిండియా సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.

అయితే, ఆ తర్వాత అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటన(2022, జనవరి)లో ఉండగానే తాను టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి వైదులుగుతున్నట్లు ప్రకటించి కోహ్లి షాకిచ్చాడు.

దీంతో రోహిత్‌ శర్మ కేవలం పరిమిత ఓవర్ల కెప్టెన్‌గానే కాకుండా టెస్టు జట్టుకు కూడా సారథి అయ్యాడు. అయితే, కోహ్లి మాదిరే రోహిత్‌ కూడా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ట్రోఫీ గెలవడంలో విఫలమయ్యాడు. ఇదిలా ఉంటే.. వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా తదుపరి నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ ఆడనుంది. దీంతో లీగ్‌ దశను ముగిస్తుంది.

చదవండి: బాగా ఎంజాయ్‌ చేశారనుకుంటా.. బై బై! మీ స్థాయికి తగునా భయ్యా? 

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని వార్తలు