నోవా లైల్స్‌ ‘డబుల్‌’ 

27 Aug, 2023 02:27 IST|Sakshi

200 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన అమెరికా అథ్లెట్‌ 

మహిళల విజేత షెరికా జాక్సన్‌ 

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌

బుడాపెస్ట్‌ (హంగేరీ): అమెరికా అథ్లెట్‌ నోవా లైల్స్‌ ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్‌’ సాధించాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఇప్పటికే 100 మీటర్ల స్ప్రింట్‌లో విజేతగా నిలిచిన అతను ఇప్పుడు 200 మీటర్ల పరుగులో కూడా అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అంచనాలకు తగినట్లుగానే సత్తా చాటిన లైల్స్‌ 19.52 సెకన్లలో పరుగు పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు.

ఈ ఈవెంట్‌లో ఎరియోన్‌ నైటాన్‌ (అమెరికా – 19.75 సెకన్లు) రజతం సాధించగా, లెట్సిలో టె»ొగో (బోట్స్‌వానా – 19.81 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ 200 మీటర్ల పరుగులో లైల్స్‌కు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం.

గత ఏడాది ఒరెగాన్‌లో జరిగిన పోటీల్లోనూ అతను బంగారు పతకం సాధించాడు. తద్వారా బోల్ట్‌ తర్వాత ఒకే ఈవెంట్‌లో వరుసగా కనీసం మూడు స్వర్ణాలు గెలిచిన రెండో అథ్లెట్‌గా లైల్స్‌ నిలిచాడు. 4గీ100 మీటర్ల రిలేలో అమెరికా జట్టు ఫైనల్‌ చేరింది. ఇందులో కూడా భాగంగా నిలిచి విజయం సాధిస్తే లైల్స్‌ ఖాతాలో మూడో స్వర్ణం చేరుతుంది.  

ప్రపంచ రికార్డుకు చేరువై... 
100 మీటర్ల స్ప్రింట్‌లో రజతం సాధించిన షెరికా 200 మీటర్ల ఈవెంట్‌లో తన పరుగుకు మరింత పదును పెట్టింది. ఈ జమైకా అథ్లెట్‌ 200 మీటర్ల పరుగులో రెండో అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుందిు. 21.41 సెకన్లలో షెరికా పరుగులు పూర్తి చేసింది.

గాబ్రియెల్‌ థామస్‌ (అమెరికా – 21.18 సెకన్లు), షకారి రిచర్డ్సన్‌ (అమెరికా – 21.92 సెకన్లు)లకు వరుసగా రజత, కాంస్యాలు దక్కాయి. ప్రపంచ రికార్డు ఇప్పటికీ అమెరికాకు చెందిన ఫ్లోరెన్స్‌ గ్రిఫిత్‌ జాయ్‌నర్‌ (21.34 సెకన్లు) పేరిటే ఉంది. 1988లో ఆమె ఈ టైమింగ్‌ను నమోదు చేసింది. గత ఏడాది కూడా ఈ ఈవెంట్‌లో షెరికా స్వర్ణం సాధించింది.   

ఆసియా రికార్డుతో ఫైనల్లోకి 
భారత 4్ఠ400 రిలే బృందం ప్రదర్శన  
ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత 4్ఠ400 మీటర్ల రిలే బృందం అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ఆసియా రికార్డుతో ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి హీట్‌లో మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. మొహమ్మద్‌ అనస్‌ యాహియా, అమోజ్‌ జాకబ్, మొహమ్మద్‌ అజ్మల్‌ వరియత్తోడి,

రాజేశ్‌ రమేశ్‌ భాగంగా ఉన్న భారత్‌ ఈ రేసును 2 నిమిషాల 59.05 సెకన్లలో పూర్తి చేసింది. ఇది కొత్త ఆసియా రికార్డు కావడం విశేషం. ఈ హీట్స్‌లో అమెరికా జట్టు మొదటి స్థానంలో నిలవగా, గ్రేట్‌ బ్రిటన్‌ టీమ్‌కు మూడో స్థానం దక్కింది. నేడు ఫైనల్‌ రేస్‌ జరుగుతుంది.   

మరిన్ని వార్తలు