వరల్డ్‌కప్‌లో అఫ్గన్‌ తరఫున ఒకే ఒక్క సెంచరీ.. సచిన్‌, కోహ్లికి కూడా సాధ్యం కాని రికార్డు

7 Nov, 2023 17:46 IST|Sakshi

ICC WC 2023: అఫ్గనిస్తాన్‌ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ సరికొత్త రికార్డులు సృష్టించాడు. ప్రపంచకప్‌ చరిత్రలో అఫ్గన్‌ తరఫున శతకం బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు.

A post shared by ICC (@icc)

ముంబైలోని వాంఖడే వేదికగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఇబ్రహీం జద్రాన్‌.. మొత్తంగా 143 బంతులు ఎదుర్కొని 129 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. జద్రాన్‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత పిన్న వయసులో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడీ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌. గతంలో అఫ్గన్‌ క్రికెటర్లలో ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేశాడు. అంతేకాదు.. ఈ ఎలైట్‌లిస్టులో టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌, పరుగుల యంత్రం రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లిని వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 

అత్యంత పిన్నవయసులో వన్డే వరల్డ్‌కప్‌లో శతకం బాదిన క్రికెటర్లు
►20 ఏళ్ల 196 రోజులు - పాల్‌ స్టిర్లింగ్‌(ఐర్లాండ్‌) నెదర్లాండ్స్‌ మీద- 2011లో కోల్‌కతాలో..
►21 ఏళ్ల 76 రోజులు- రిక్కీ పాంటింగ్‌(ఆస్ట్రేలియా) వెస్టిండీస్‌ మీద- 1996లో జైపూర్‌లో..
►21 ఏళ్ల 87 రోజులు- అవిష్క ఫెర్నాండో(శ్రీలంక) వెస్టిండీస్‌ మీద- 2019లో ఛెస్టెర్‌ లీ స్ట్రీట్‌లో
►21 ఏళ్ల 330 రోజులు- ఇబ్రహీం జద్రాన్‌(అఫ్గనిస్తాన్‌) ఆస్ట్రేలియా మీద- ముంబైలో-2023లో
►22 ఏళ్ల 106 రోజులు- విరాట్‌ కోహ్లి(ఇండియా) బంగ్లాదేశ్‌ మీద- మీర్పూర్‌- 2011లో
►22 ఏళ్ల 300 రోజులు- సచిన్‌ టెండుల్కర్‌(ఇండియా)- కెన్యా మీద- కటక్‌లో- 1996లో..

ఆస్ట్రేలియా లక్ష్యం ఎంతంటే!
ప్రపంచకప్‌-2023లో భాగంగా ముంబైలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గనిస్తాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో సెంచరీ హీరో, ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ 129 పరుగులతో చెలరేగాడు. మిగతా వాళ్లలో రహ్మత్‌ షా(30), రషీద్‌ ఖాన్‌(35- నాటౌట్‌) మాత్రమే ముప్పై పరుగుల మార్కును అందుకున్నారు.

ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో అఫ్గనిస్తాన్‌ 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కగా.. మిచెల్‌ స్టార్క్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, ఆడం జంపా ఒక్కో వికెట్‌ పడగొట్టారు. కాగా వరల్డ్‌కప్‌ చరిత్రలో అఫ్గనిస్తాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

చదవండి:  గిల్‌తో ఫొటో షేర్‌ చేసి ‘రిలేషన్‌’ కన్ఫర్మ్‌ చేసిందంటూ ప్రచారాలు.. వాస్తవం ఇదే

మరిన్ని వార్తలు