CWC 2023 IND Vs NZ: హృదయాన్ని తాకావు.. నా రికార్డు బ్రేక్‌ చేయడం సంతోషం: సచిన్‌ ట్వీట్‌ వైరల్‌

15 Nov, 2023 20:53 IST|Sakshi

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఆట పట్ల కోహ్లి నిబద్ధతకు ఫిదా అయ్యానని తెలిపాడు. ఏదేమైనా తన ఆల్‌టైమ్‌ రికార్డును భారత ఆటగాడే బద్దలు కొట్టడం రెట్టింపు సంతోషాన్నిస్తోందని పేర్కొన్నాడు.

కాగా రికార్డుల రారాజు కోహ్లి అంతర్జాతీయ వన్డేల్లో 50వ శతకం సాధించాడు. తద్వారా సచిన్‌ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును బ్రేక్‌ చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్‌ సందర్భంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

ముంబైలోని వాంఖడే వేదికగా కోహ్లి రికార్డు సెంచరీని ప్రత్యక్షంగా వీక్షించిన సచిన్‌ టెండుల్కర్‌.. చప్పట్లతో తనకు అభినందనలు తెలిపాడు. అదే విధంగా ఎక్స్‌(ట్విటర్‌) వేదికగానూ స్పందించాడు. ఈ మేరకు.. ‘‘తొలిసారి ఇండియన్‌ డ్రెస్సింగ్‌ రూంలో నిన్ను కలిసినపుడు.. నా పాదాలు తాకావు. 

అపుడు నీ సహచర ఆటగాళ్లంతా నిన్ను ఆటపట్టించారు. నేను కూడా రోజు నవ్వు ఆపులేకపోయాను. అయితే, ఆట పట్ల నీ అంకితభావం, అద్భుతమైన నైపుణ్యాలతో అనతికాలంలోనే నా హృదయాన్ని తాకావు.

అప్పటి ఆ కుర్రాడు ఇప్పుడు ‘విరాట్‌’గా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా రికార్డును ఓ భారత ఆటగాడు బద్దలు కొట్టినందుకు ఎంతో సంతోషపడుతున్నా. అది కూడా వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్‌ వంటి ప్రతిష్టాత్మక ‍మ్యాచ్‌లో.. అదీ నా హోం గ్రౌండ్‌లో.. అది కూడా ఇంత సునాయాసంగా!!’’ అంటూ కోహ్లిని ఆకాశానికెత్తాడు. సచిన్‌ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే.. కివీస్‌తో సెమీ ఫైనల్లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(47), శుబ్‌మన్‌ గిల్‌(80- నాటౌట్‌) రాణించగా... కోహ్లి (117), శ్రేయస్‌ అయ్యర్‌(105) శతకాలతో మెరిశారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి టీమిండియా 397 పరుగులు చేసింది.  
 

మరిన్ని వార్తలు