దక్షిణాఫ్రికా పర్యటనకు జంబో జట్టు..!

30 Nov, 2023 15:07 IST|Sakshi

దాదాపు నెల రోజుల పాటు సాగే దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత సెలెక్టర్లు ఇవాళ జట్టును ప్రకటిస్తారని ప్రచారం​ జరుగుతుంది. ఈ పర్యటన కోసం సెలెక్టర్లు జంబో జట్టును ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఈ పర్యటన నిమిత్తం బీసీసీఐ ఏకంగా 45 వీసాలకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ విషయం సోషల్‌మీడియాలో లీక్‌ కావడంతో సెలక్టర్లు జంబో జట్టును ప్రకటించడం ఖాయమని భారత క్రికెట్‌ అభిమానులు నిర్ధారించుకున్నారు.

డిసెంబర్‌ 10 నుంచి జనవరి 7, 2024 వరకు సాగే ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్ట్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మూడు ఫార్మాట్లలో సాగే ఈ సిరీస్‌ కోసం భారత సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించే అవకాశం ఉంది. సీనియర్లు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరంగా ఉండటం దాదాపుగా ఖరారైంది. రోహిత్‌, విరాట్‌ కేవలం టెస్ట్‌ సిరీస్‌కు మాత్రమే అందుబాటులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కామన్‌ ప్లేయర్లతో కలుపుకుంటే ఈ పర్యటన కోసం కనీసం 25 ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. అదనంగా సహాయ సిబ్బందిని కలుపుకుంటే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 45 వీసాల అంశం కరెక్టే అనిపిస్తుంది. 

కాగా, ప్రస్తుతం ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ఆడుతున్న జట్టులోని మెజార్టీ సభ్యులను భారత సెలెక్టర్లు దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేయవచ్చు. వీరిలో ఎక్కువ శాతం టీ20 జట్టులో ఉండే అవకాశం ఉంది. వీరికి అదనంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్లు, దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్న ఆటగాళ్లు ఏదో ఒక ఫార్మాట్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అన్ని ఫార్మాట్లకు వేర్వేరే కెప్టెన్లు  ఉంటారన్న టాక్‌ కూడా వినిపిస్తుంది. మరి సెలెక్టర్లు ఏ మేరకు నిర్ణయిస్తారో తేలాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే. 

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా షెడ్యూల్‌..

డిసెంబర్‌ 10: తొలి టీ20 (డర్బన్‌)

డిసెంబర్‌ 12: రెండో టీ20 (పోర్ట్‌ ఎలిజబెత్‌)

డిసెంబర్‌ 14: మూడో టీ20 (జోహనెస్‌బర్గ్‌)

డిసెంబర్‌ 17: తొలి వన్డే (జోహనెస్‌బర్గ్‌)

డిసెంబర్‌ 19: రెండో వన్డే (పోర్ట్‌ ఎలిజబెత్‌)

డిసెంబర్‌ 21: మూడో వన్డే (పార్ల్‌)

డిసెంబర్‌ 26 నుంచి 30: తొలి టెస్ట్‌ (సెంచూరియన్‌)

2024 జనవరి 3 నుంచి 7: రెండో టెస్ట్‌ (కేప్‌టౌన్‌)
 

మరిన్ని వార్తలు