Chetan Sharma: గిల్‌, ఇషాన్‌లు ఇద్దరు స్టార్‌ క్రికెటర్ల కెరీర్‌లను ప్రమాదంలో పడేశారు..!

15 Feb, 2023 15:43 IST|Sakshi

జీ న్యూస్‌ చేపట్టిన స్టింగ్‌ ఆపరేషన్‌లో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ సంచలన విషయాలను బహిర్గతం చేశాడు. టీమిండియా, బీసీసీఐల్లో జరిగిన, జరుగుతున్న ఎన్నో విషయాలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. భారత క్రికెట్‌, బీసీసీఐల్లోని పెద్ద తలకాయలకు సంబంధించిన విషయాల్లో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను వెల్లడించాడు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, టీమిండియా ప్రస్తుత, మాజీ సారధులు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలకు సంబంధించిన ఆసక్తికర అంశాలను వివరించాడు. 

కెప్టెన్సీ విషయంలో నాటి బీసీసీఐ బాస్‌ గంగూలీ.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మధ్య వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అగ్గి రాజేశాడు. కోహ్లి టీ20 కెప్టెన్సీ వదిలేస్తానన్నప్పుడు బీసీసీఐ అతన్ని పునరాలోచించుకోవాలని కోరిందని, అలాగే వన్డే సారధ్య బాధ్యతల నుంచి తప్పించేముందు బోర్డు కోహ్లితో మాట్లాడిందని నాడు కోహ్లి ప్రెస్‌ మీట్‌లో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లి-రోహిత్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారిలో ఇగో ఉందని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. వాస్తవానికి గంగూలీకి రోహిత్‌ శర్మపై ఎలాంటి ప్రత్యేక ఇంట్రెస్ట్‌ లేనప్పటికీ.. కోహ్లిపై మాత్రం వ్యతిరేకత ఉండిందంటూ బాంబు పేల్చాడు. టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేసి కోహ్లి బీసీసీఐపై పైచేయి సాధించాలని భావించాడని, అది నచ్చక పోవడం వల్లనే గంగూలీ-కోహ్లిల మధ్య గ్యాప్‌ పెరిగిందని అన్నాడు.

అలాగే టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ ప్రూవ్‌ చేసుకునేందుకు ఇంజక్షన్లు వాడతారని, అవి డోపింగ్‌ టెస్ట్‌కు సైతం చిక్కని అధునాతన ఔషదాలంటూ భారత క్రికెట్‌లో ప్రకంపనలకు ఆధ్యం పోశాడు. కొందరు ఆటగాళ్లు పూర్తి ఫిట్‌గా లేకపోయినా తమను ఆడించాలని బతిమాలతారంటూ సరికొత్త దుమారానికి తెరలేపాడు.

ఇదే సందర్భంగా శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌, శిఖర్‌ ధవన్‌ల పేర్లను ప్రస్తావిస్తూ సంచలన కామెంట్స్‌ చేశాడు. గిల్‌, ఇషాన్‌ కిషన్‌ల వల్ల కేఎల్‌ రాహుల్‌, సంజూ శాంసన్‌, శిఖర్‌ ధవన్‌ల కెరీర్‌లు ప్రమాదంలో పడ్డాయని.. గిల్‌, ఇషాన్‌ల హవాలో రాహుల్‌, సంజూలకు అవకాశాలు క్రమంగా కనుమరుగవుతాయని అన్నాడు.

శిఖర్‌ ధవన్‌ ట్రిపుల్‌ సెంచరీలు చేసినా బీసీసీఐ పట్టించునే పరిస్థితుల్లో లేదని, అతనో ఔట్‌డేటెడ్‌ ప్లేయర్‌ అని కామెంట్‌ చేశాడు. భారత క్రికెట్‌ గురించి.. బీసీసీఐ, టీమిండియాలో పెద్ద తలకాయల గురించి చేతన్‌ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్‌ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతున్నాయి. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన చేతన్‌ శర్మపై బీసీసీఐ ఏ చర్యలకు ఉపక్రమిస్తుందో వేచి చూడాలి. 

మరిన్ని వార్తలు