CWC 2023: కొనసాగుతున్న గిల్‌ మేనియా.. నెదర్లాండ్స్‌పై హాఫ్‌ సెంచరీతో..!

12 Nov, 2023 16:45 IST|Sakshi

టీమిండియా యంగ్‌ గన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఈ ఏడాది ఫార్మాట్లకతీతంగా అరాచకమైన ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో అయితే అతను ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు.

వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఇవాళ నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీ (32 బంతుల్లో​ 51; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) నమోదు చేసిన గిల్‌.. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇందులో గిల్‌ ఒక్క వన్డేల్లోనే 5 సెంచరీలు, 8 హాఫ్‌ సెంచరీల సాయంతో 1500 పరుగులు (27 ఇన్నింగ్స్‌) సాధించడం​ విశేషం​. 

గిల్‌ తర్వాత ఈ ఏడాది అత్యధిక పరుగలు (అన్ని ఫార్మాట్లు) చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ కోహ్లి (1712), కుశాల్‌ మెండిస్‌ (1690), డారిల్‌ మిచెల్‌ (1686), రోహిత్‌ శర్మ (1677) వరుసగా ఉన్నారు. కాగా, నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించిన గిల్‌, రోహిత్‌ శర్మతో కలిసి టీమిండియాకు శుభారంభాన్ని అందించాడు.

గిల్‌కు ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇది మూడో హాఫ్‌ సెంచరీ (7 మ్యాచ్‌ల్లో). నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ (61), గిల్‌తో పాటు విరాట్‌ (51), శ్రేయస్‌ (62 నాటౌట్‌) కూడా హాఫ్‌ సెంచరీలు సాధించడంతో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా సాగుతుంది. 37 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్‌ 257/3గా ఉంది. శ్రేయస్‌కు జతగా కేఎల్‌ రాహుల్‌ (22) క్రీజ్‌లో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు