క్రికెట్‌ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..

21 Dec, 2023 12:03 IST|Sakshi

పాఠశాల స్థాయి నుంచే జగన్‌కు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ.. ముఖ్యంగా క్రికెట్‌ అంటే మరీ ఇష్టం.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సన్నిహితులు చెప్పే మాట ఇది! హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో విద్యనభ్యసించిన వైఎస్‌ జగన్‌.. క్రికెట్‌తో పాటు బాస్కెల్‌ బాల్‌ వంటి ఇతర క్రీడల్లోనూ భాగమయ్యే వారు.

ఆ సమయంలో వైఎస్‌ కుటుంబం బంజారాహిల్స్‌లో నివాసం ఉండేవారు. కేవలం పాఠశాలలోనే కాకుండా.. ఇంటి దగ్గర కూడా స్నేహ బృందం ఏర్పాటు చేసుకున్న జగన్‌.. వారితో కలిసి క్రికెట్‌ ఆడుతూ ఉండేవారు. స్కూలైనా.. బయట అయినా ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌లో నాయకుడిగా ఉండేందుకే ఇష్టపడే జగన్‌.. హెచ్‌పీఎస్‌లో హౌజ్‌ కెప్టెన్‌గా అరుదైన ఘనత దక్కించుకున్నారు.

పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. మిగితా మూడు హౌజ్‌ల జట్లను ఓడించి రెడ్‌ హౌజ్‌కు ఆల్‌రౌండర్‌ చాంపియన్‌షిప్‌ అందించారు జగన్‌. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీలలోనూ తమ టీమ్‌ ముందుండేలా చేసి తన నాయకత్వ పటిమతో టైటిల్‌ సాధించారు. ఈ విషయాలను యువకెరటం పుస్తకంలో ఎఎస్‌ఆర్‌ మూర్తి, బుర్రా విజయశేఖర్‌  వెల్లడించారు. 

ఏపీఎల్‌తో ఆంధ్ర క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడా రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్‌లో ఆంధ్ర క్రీడాకారుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకుంటోంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.

సీఎస్‌కే ముందుకు వచ్చేలా చర్యలు
ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాదు.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్‌ స్టేడియం నిర్మించే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. విశాఖలో ఉన్న వైఎస్సార్‌ స్టేడియంను క్రీడలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది.  అంతేకాదు రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టింది.

ఇక వైఎస్‌ జగన్‌ హయాంలోనే ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ పేరిట ఏసీఏ సరికొత్త క్రికెట్‌ టోర్నీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2022లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో రాయలసీమ కింగ్స్‌, కోస్టల్‌ రైడర్స్, బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్‌ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్‌ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగాయి.

విజయవంతంగా  ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ రెండు సీజన్లు
అరంగేట్ర ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏసీఏ.. తాజాగా రెండో సీజన్‌ను కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసింది. ఏపీఎల్‌ తొలి సీజన్‌లో కోస్టల్‌ రైడర్స్‌ విజేతగా నిలవగా.. ఈ ఏడాది రాయలసీమ కింగ్స్‌ టైటిల్‌ సాధించింది. 

కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ రాణించిన ఆటగాళ్లకే ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలక్టర్లు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఔత్సాహిక ఆంధ్ర క్రికెటర్లు కూడా ఐపీఎల్‌ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా ఏసీఏ ఇలా ఏపీఎల్‌ పేరిట తమ వంతు ప్రయత్నం చేస్తోంది.

క్రికెట్‌ దిగ్గజాలను ఆహ్వానిస్తూ
1983 వరల్డ్‌కప్‌ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సహా టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ తదితరులను ఈ ఈవెంట్లకు ఆహ్వానించడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీ క్రీడల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందంటూ బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం.

ఏపీ సీఎం కప్‌, ఆడుదాం ఆంధ్రా
యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్‌ ప్రభుత్వం.. ఏపీ సీఎం కప్‌ పేరిట క్రికెట్‌తో పాటు క్రికెటేతర క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టింది. 

అంబాసిడర్‌గా అంబటి రాయుడు
ఈ ఈవెంట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌లో అరుదైన ఘనతలు సాధించిన అంబటి రాయుడిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చిన పీవీ సింధు(బ్యాడ్మింటన్‌), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కేఎస్‌ భరత్‌(క్రికెటర్‌) తదితరులను సమున్నతరీతిలో సత్కరించింది.

>
మరిన్ని వార్తలు