సొంత దేశాన్ని వీడి యూఎస్‌ఏకు ఆడనున్న ఫాస్టెస్ట్‌ సెంచరీ హీరో

29 Mar, 2024 14:38 IST|Sakshi

వన్డేల్లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ (36 బంతుల్లో) సెంచరీ వీరుడు, న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కోరె ఆండర్సన్‌ సొంత దేశాన్ని వీడి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యూఎస్‌ఏకు ఆడేందుకు సిద్దమయ్యాడు. త్వరలో కెనడాతో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం యూఎస్‌ఏ సెలెక్టర్లు ఆండర్సన్‌ ఎంపిక చేశారు.

2018 నవంబర్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆండర్సన్‌.. వ్యక్తిగత కారణాల చేత 2020లో యూఎస్‌ఏకు షిఫ్ట్‌ అయ్యాడు. అప్పటి నుంచి అక్కడే దేశవాలీ క్రికెట్‌ (మైనర్‌ లీగ్‌ క్రికెట్‌) ఆడుతూ ఐదేళ్ల నిరీక్షణ అనంతరం జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

లోకల్‌ కేటగిరీలో మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ ఆడే అవకాశం దక్కించుకున్న ఆండర్సన్‌.. ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ తరఫున మెరుగైన ప్రదర్శనలు చేశాడు. కెనడా సిరీస్‌ కోసం ఆండర్సన్‌తో పాటు మరికొందరు నాన్‌ ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు. భారత అండర్‌-19 ఫేమ్‌ హర్మీత్‌ సింగ్‌ యూఎస్‌ఏ దేశవాలీ టోర్నీలతో పాటు మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో సియాటిల్‌ ఆర్కాస్‌ తరఫున రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హర్మీత్‌తో పాటు మరో భారత క్రికెటర్‌ కూడా యూఎస్‌ఏ జట్టుకు ఎంపికయ్యాడు.

ఢిల్లీ మాజీ ఆటగాడు, ఐపీఎల్‌లో ఆర్సీబీ ప్లేయర్‌ మిలింద్‌ కుమార్‌ అక్కడి దేశవాలీ క్రికెట్‌లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు కెనడా జాతీయ జట్టు మాజీ కెప్టెన్‌, భారత మూలాలున్న నితీశ్‌ కుమార్‌ కూడా యూఎస్‌ఏ జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. తాజాగా ప్రకటించిన యూఎస్‌ఏ జట్టులో భారత అండర్‌-19 మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ బ్యాటర్‌ ఉన్ముక్త్‌ చంద్‌కు చోటు దక్కలేదు. ఉన్ముక్త్‌కు నితీశ్‌ కుమార్‌ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అంతిమంగా సెలెక్టరు​ నితీశ్‌పైపే మొగ్గు చూపారు. 

కెనడా సిరీస్‌ కోసం ఎంపిక చేసిన యూఎస్‌ఏ జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరె అండర్సన్, గజానంద్ సింగ్, జెస్సీ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, నిసర్గ్ పటేల్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, నోస్తుష్ కెంజిగే, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, ఉస్మాన్ రఫిక్

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers