‘హిజాబ్‌’ ఉదంతంలో న్యాయం.. బాధితులకు రూ. 146 కోట్ల పరిహారం! | Sakshi
Sakshi News home page

New York: ‘హిజాబ్‌’ ఉదంతంలో న్యాయం.. బాధితులకు రూ. 146 కోట్ల పరిహారం!

Published Sat, Apr 6 2024 1:10 PM

NCY Will Pay USD 17 5 M to Settle their Suit New York - Sakshi

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2017లో ఇద్దరు ముస్లిం మహిళలకు అవమానం జరిగింది. ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వారికి న్యాయం లభించింది. ఇందుకు పరిహారంగా బాధితులకు 17.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు చెల్లించడానికి న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది.

వివరాల్లోకి వెళితే 2017లో  స్థానిక చట్టాలను, నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలతో న్యూయార్క్ పోలీసులు ఇద్దరు ముస్లిం మహిళలను అరెస్టు చేశారు. ఆ తరువాత వారిని జైలుకు పంపే ముందు నిబంధనలలో భాగంగా వారికి ఫొటోలు తీశారు. వీటిని మగ్‌ షాట్‌ అంటారు. ఈ ఫొటోల కోసం పోలీసులు ఆ మహిళల హిజాబ్‌ను తొలగించారు. దీనిని బాధిత మహిళలు అవమానంగా భావించారు. 

ఈ ఉదంతంపై బాధితులు 2018లో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ బాధితుల మత విశ్వాసాలను పరిగణించకుండా పోలీసులు వారి హిజాబ్ తొలగించి తీవ్రంగా అవమానించారని, వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. 

ఈ కేసు నేపధ్యంలో మగ్ షాట్ నిబంధనలపై అమెరికా అంతటా చర్చ జరిగింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం కావడంతో 2020లో మగ్ షాట్ నిబంధనలలో పోలీసులు పలు మార్పులు చేశారు.  ఈ ఫొటోల కోసం ముస్లిం మహిళలు హిజాబ్ తొలగించనవసరంలేదని, ముఖం కనిపించేలా ఉంటేచాలని పేర్కొన్నారు. ఈ నిబంధన మిగతా మతాల వారికీ వర్తిస్తుందని, సిక్కులు కూడా తమ టర్బన్‌ను తొలగించాల్సిన అవసరం పోలీసులు వివరించారు. 

ఆదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం పోలీసులు బాధిత మహిళలతో పాటు గతంలో  ఈ విధంగా  ఇబ్బంది పడిన వారికీ కూడా పరిహారం చెల్లించేందుకు అంగీకరించారు. ఈ ఇద్దరు బాధిత మహిళలకు ఒక్కొక్కరికీ 7 వేల నుంచి పది వేల డాలర్ల చొప్పున మొత్తం 17.5 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ అంగీకరించింది. మన రూపాయల్లో  ఇది సుమారు రూ. 146 కోట్లకు సమానం.

Advertisement
Advertisement