Babar Azam On Hyderabad Biryani: హైదరాబాద్‌ బిర్యానీ ఎలా ఉంది బాబర్‌.. ముసిముసి నవ్వులు నవ్వుకున్న పాక్‌ కెప్టెన్‌

4 Oct, 2023 20:18 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభానికి కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో యావత్‌ క్రికెట్‌ ప్రపంచం వరల్డ్‌కప్‌ మత్తులో ఊగిపోతుంది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లంతా వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ కోసం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కొత్త పెళ్లి కూతురులా ముస్తాబైంది. 

మరో పక్క అహ్మదాబాద్‌లో ఇవాళ జరిగిన కెప్టెన్ల మీటింగ్‌ క్రికెట్‌ అభిమానులకు కావాల్సినంత ఆనందాన్ని అందించింది. ఆధ్యాంతం ఆహ్లాద భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత రవిశాస్త్రి తనదైన శైలి చమత్కారంతో అందరి మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. ఈ కార్యక్రమంలో విలేకరుల సమావేశం సైతం నవ్వులు పూయించింది. తొలుత రోహిత్‌ శర్మను ఓ విలేఖరి గత వరల్డ్‌కప్‌ ఫైనల్లో బౌండరీల సంఖ్య ఆధారంగా విజేతను నిర్ణయించడం సబబా అని అడిగాడు. ఇందుకు హిట్‌మ్యాన్‌ తనదైన శైలిలో.. సర్‌ విజేతను నిర్ణయించడం నా పని కాదంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. 

ఇదే సమయంలో జర్నలిస్ట్‌-రోహిత్‌ మధ్య జరిగిన సంభాషణను పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ పక్కనే ఉన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌కు వివరిస్తూ కనిపించాడు. ఈ చిట్‌చాట్‌ జరుగుతుండగానే సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా ప్రయాణ బడలిక కారణంగా కునుకు తీస్తూ కనిపించాడు.

ప్రశ్నోత్తరాల సమయంలో పాక్‌ కెప్టెన్‌ వంతు రాగా.. మధ్యలో వ్యాఖ్యాత రవిశాస్త్రి కలుగజేసుకుని.. బాబర్‌.. హైదరాబాద్‌ బిర్యానీ ఎలా ఉందంటూ ప్రశ్నించాడు. ఇందుకు ముసిముసి నవ్వులు నవ్వుకున్న పాక్‌ కెప్టెన్‌.. ఇప్పటికే 100 సార్లు చెప్పాను.. హైదరాబాద్‌ బిర్యానీ చాలా బాగుంది.. మా టీమ్‌ మొత్తానికి బాగా నచ్చింది.. అయితే కరాచీ బిర్యానీతో పోలిస్తే కాస్త స్పైసీగా ఉందని​ అన్నాడు. బాబర్‌ హైదరాబాద్‌ బిర్యానీ గురించి వివరిస్తుండగా అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు. 

కాగా, పాకిస్తాన్‌ ఏడేళ్ల తర్వాత వరల్డ్‌కప్‌ కోసం భారత గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వార్మప్‌ మ్యాచ్‌ల కోసం పాక్‌ టీమ్‌ హైదరాబాద్‌ నగరంలో బస చేసింది. పాక్‌ ఇక్కడే తమ రెండు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడి, వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ కోసం కూడా సిద్దపడుతుంది. బాబర్‌ సేన నగరంలో స్టే చేస్తున్న క్రమంలో ఇక్కడున్న చాలా ప్రదేశాలను సందర్శిం​చింది. ఈ క్రమంలో పాక్‌ క్రికెటర్లు పలుమార్లు హైదరాబాదీ బిర్యానీని ఆరగించారు. వారికి ఇక్కడి బిర్యానీతో పాటు హైదరాబాదీ ఆతిథ్యం కూడా బాగా నచ్చింది. ఇక్కడి జనాలు పాక్‌ క్రికెటర్లను చూసేందుకు ఎగబడటంతో వారు మురిసిపోతున్నారు.

మరిన్ని వార్తలు