#Virat Kohli: సింగిల్స్‌, డబుల్స్‌.. అందుకే! ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్‌ పాజీ.. కష్టమే!

15 Nov, 2023 19:15 IST|Sakshi
ఓవైపు సచిన్‌ పాజీ- మరోవైపు అనుష్క: కోహ్లి(PC: Disney+Hotstar)

ICC WC 2023- Ind vs NZ- Virat Kohli 50th ODI Century: ‘‘కోల్‌కతాలో కూడా చెప్పాను కదా!.. ఓ గొప్ప వ్యక్తి నన్ను అభినందించారు. ఇప్పుడు కూడా ఇదంతా ఓ కలలానే ఉంది. నిజానికి కల నిజమైనట్లు ఉంది. ఏంటో నాకే కొత్తగా ఉంది. ఈరోజు కూడా కీలక మ్యాచ్‌.. ఇందులో నా వంతుగా ఏం చేయాలో అది చేశాను.

సింగిల్స్‌, డబుల్స్‌.. ఏదైనా జట్టు కోసమే
నా సహచర ఆటగాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అన్నీ అనుకూలించి ఈరోజు మేము భారీ స్కోరు చేయగలిగాం. జట్టును గెలిపించాలన్నదే నా అంతిమ లక్ష్యం. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాను.

సింగిల్స్‌, డబుల్స్‌.. బౌండరీలు.. ఏదైనా జట్టు నా నుంచి ఆశిస్తున్న ప్రదర్శనకు అనుగుణంగానే ఆడతాను. నా శక్తిసామర్థ్యాల మేరకు అత్యుత్తమ ఆట తీరుతో జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్‌ ఆడేందుకు ప్రయత్నిస్తా. క్రీజులో కుదురుకున్న తర్వాత బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ ఉంటా.

ఓవైపు అనుష్క.. మరోవైపు సచిన్‌ పాజీ
ఇక ఈరోజు నా సెలబ్రేషన్స్‌ గురించి చెప్పాలంటే.. అనుష్క, సచిన్‌ పాజీ ఇద్దరూ ఇక్కడే ఉన్నారు. అసలు ఈ ఫీలింగ్‌ను ఎలా వర్ణించాలో కూడా అర్థం కావడం లేదు. ఒకవేళ నేను ఓ పరిపూర్ణ ఛాయాచిత్రం గీయాలనుకుంటే.. బహుశా అది ఇదేనేమో!

నేను అత్యంత ప్రేమించే వ్యక్తి.. నా జీవిత భాగస్వామి అనుష్క.. నా హీరో సచిన్‌ టెండుల్కర్‌.. వీళ్లిద్దరి ముందు నేను వన్డేల్లో 50వ శతకం సాధించగలగడం.. అది కూడా చారిత్రాత్మక వాంఖడేలో.. ఇంతకంటే అత్యద్భుతం ఏముంటుంది?!

అందరూ బాగా ఆడినందు వల్లే
ఈరోజు మేము నాకౌట్‌ మ్యాచ్‌లో 400 పరుగుల స్కోరుకు చేరువగా వచ్చాం. శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాడు.. షాట్లు బాదాడు.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక టాప్‌లో శుబ్‌మన్‌, రోహిత్‌ అద్భుతం చేశారు. కేఎల్‌ రాహుల్‌ తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.. ప్రతి ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయం చేశారు’’- వన్డేల్లో 50 సెంచరీల వీరుడు, టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ముంబైలోని వాంఖడేలో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ(47), శుబ్‌మన్‌ గిల్‌(80- నాటౌట్‌).. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రికార్డు సెంచరీతో మెరిశాడు.

సచిన్‌ రికార్డు బద్దలు
ప్రపంచకప్‌ టోర్నీలో సెమీస్‌ గండాన్ని దాటి 117 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో ఓవరాల్‌గా 80వ శతకం సాధించాడు. వన్డేల్లో కోహ్లికి ఇది 50వ సెంచరీ. తద్వారా క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టాడు.

ఫైనల్‌కు చేరువయ్యేందుకు
మరోవైపు.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ సైతం శతకం(105) బాదాడు. ఐదో నంబర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ 39 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి రోహిత్‌ సేన 397 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ నేపథ్యంలో టీమిండియా ఇన్నింగ్స్‌ అనంతరం విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ.. తన రికార్డు సెంచరీ సమయంలో కలిగిన భావోద్వేగాలు, జట్టు భారీ స్కోరు సాధించిన విధానం గురించి చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు