CWC 2023: వరల్డ్‌కప్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. క్వింటన్‌ డికాక్‌

17 Nov, 2023 11:03 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఐదోసారి సెమీస్‌ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. ఈ ఎడిషన్‌ ప్రారంభం నుంచి అద్బుతమైన ఆటతీరు కనబర్చి వరుస విజయాలు సాధించిన సఫారీలు.. సెమీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. లీగ్‌ దశ మొత్తంలో ఇరదీసిన సౌతాఫ్రికా బ్యాటర్లు​ నిన్నటి నాకౌట్‌ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. టోర్నీ టాప్‌ 10 రన్‌ స్కోరర్ల జాబితాలో ఉన్న డికాక్‌, డస్సెన్‌, మార్క్రమ్‌ ఆసీస్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. డికాక్‌ 3, డస్సెన్‌ 6, మార్క్రమ్‌ 10 పరుగులు చేసి ఔటయ్యారు. 

ఆసీస్‌ చేతిలో సౌతాఫ్రికా ఓడినప్పటికీ.. క్వింటన్‌ డికాక్‌ మాత్రం ఓ అరుదైన ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్‌ తన కెరీర్‌ ఆఖరి మ్యాచ్‌తో వరల్డ్‌కప్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేసి విరాట్‌ కోహ్లి (10 మ్యాచ్‌ల్లో 711 పరుగులు) తర్వాత సెకెండ్‌ లీడింగ్‌ రన్‌స్కోరర్‌గా నిలిచిన డికాక్‌.. ఈ ఎడిషన్‌లో 20 క్యాచ్‌లు కూడా పట్టి ప్రపంచకప్‌ చరిత్రలో 500 ప్లస్‌ పరుగులు, 20 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాడు.

అలాగే ఓ సింగిల్‌ వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో గిల్‌క్రిస్ట్‌ (2003లో 21 క్యాచ్‌లు), టామ్‌ లాథమ్‌ (2019లో 21 క్యాచ్‌లు), అలెక్స్‌ క్యారీ (2019లో 20 క్యాచ్‌లు) తర్వాత అత్యధిక క్యాచ్‌లు (2023లో 20 క్యాచ్‌లు) అందుకున్న వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

ఇదిలా ఉంటే, రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాపై గెలవడంతో ఆస్ట్రేలియా ఎనిమిదో సారి ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరింది. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్‌.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి నాలుగోసారి ఫైనల్‌కు చేరింది.  అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆసీస్‌ల మధ్య నవంబర్‌ 19న వరల్డ్‌కప్‌ ఫైనల్‌ జరుగనుంది. 
 

మరిన్ని వార్తలు