World Cup 2023: పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా

16 Nov, 2023 22:32 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో దక్షిణాఫ్రికా పోరాటం ​ముగిసింది. మరోసారి నాకౌట్స్‌ దశను సౌతాఫ్రికా దాటలేకపోయింది. ఈ ​మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్లో 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఆఖరివరకు సఫారీ బౌలర్లు పోరాడినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేకపోయారు. 213 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

దీంతో ఎనిమిదో సారి వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(62) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. స్మిత్‌(30), ఇంగ్లీష్‌(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరితో పాటు టెయిలెండర్లు ప్యాట్‌ కమ్మిన్స్‌(14), స్టార్క్‌(16) కూడా ఆసీస్‌ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో షమ్సీ, కొయెట్జీ తలా రెండు వికెట్లు సాధించగా.. మహారాజ్‌, రబాడ, మార్‌క్రమ్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా  49. 4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోర్‌ సాధించడం‍లో డేవిడ్‌ మిల్లర్‌ కీలక​ పాత్ర పోషించాడు.

మిల్లర్‌ విరోచిత శతకంతో చెలరేగాడు. 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేసి  జట్టుకు ఫైటింగ్‌ స్కోర్‌ను అందించాడు.  24 పరుగులు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ప్రోటీస్‌ను మిల్లర్‌, క్లాసెన్‌(47) అదుకున్నారు.  క్లాసెన్‌ ఔటైన తర్వాత  మిల్లర్‌  పూర్తి బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు.

ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌, కమ్మిన్స్‌ 3వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్‌, హెడ్‌ తలా రెండు వికెట్లు సాధించారు. ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ట్రావిస్‌ హెడ్‌కు దక్కింది. ఇక  నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ పోరులో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు