CWC 2023: మా విజయ రహస్యం అదే.. నెదర్లాండ్స్‌పై విజయానంతరం రోహిత్‌ శర్మ

13 Nov, 2023 07:38 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్‌ వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి, లీగ్‌ దశలో అజేయ జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగి పసికూన నెదర్లాండ్స్‌ను మట్టికరిపించింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) హాఫ్‌ సెంచరీలతో రాణించారు.

అనంతరం ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 47.5 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఏకంగా తొమ్మది మంది బౌలర్లను ప్రయోగించిన రోహిత్‌ శర్మ దాదాపుగా అందరి నుంచి ఫలితం రాబట్టాడు. బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌, జడేజా తలో 2 వికెట్లు పడగొట్టగా.. విరాట్‌, రోహిత్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. షమీ, గిల్‌,సూర్యకుమార్‌ యాదవ్‌లకు వికెట్‌ దక్కలేదు. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు (54) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము టోర్నమెంట్‌ ప్రారంభం నుంచి ఒక సమయంలో ఒకే గేమ్ గురించి ఆలోచించి, ఆ మ్యాచ్‌లో బాగా ఆడాలని అనుకున్నాం. ఇది సుదీర్ఘ టోర్నమెంట్ కాబట్టి  చాలా దూరం చూడాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కో మ్యాచ్‌ లక్ష్యంగా పెట్టుకుని, అందులో బాగా ఆడాలని అనుకున్నాం​. అలాగే చేశాం. వివిధ వేదికపై పరిస్థితులకు అనుగుణంగా, అందరం​ కలిసికట్టుగా ఆడాం. ఫలితం సాధించాం.

మా వరుస విజయాల వెనుక ఉన్న రహస్యం ఇదే. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు ఒక్కో సందర్భంలో బాధ్యతలు తీసుకుని సత్తా చాటడం శుభపరిణామం. పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుండాలంటే  ఫలితాలు చాలా ముఖ్యం. టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి జట్టు సభ్యులందరం కుటంబంలా మమేకమైపోయాం. ఒకరి కంపెనీని మరొకరం ఆస్వాదించాం. ప్రతి గేమ్‌నుసరదాగా, ఉత్సాహంగా ఆడాలని ప్లాన్‌ చేసుకున్నాం. అదే విజయాలకు దోహదపడింది. ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకాకుండా ఇదే మమ్మల్ని కాపాడింది.

మాపై అంచనాలు చాలా ఉన్నాయి. మేము అన్నింటినీ పక్కనపెట్టి, తదుపరి టాస్క్‌పైనే (సెమీస్‌) దృష్టి పెట్టాలనుకున్నాం. తొమ్మిది మంది బౌలర్లను ప్రయోగించడంపై స్పందిస్తూ.. బౌలింగ్‌లో ప్రయోగాలు చేసేందుకు ఇదే సరైన సమయమని భావించా. మాకు ప్రస్తుతం ఐదు మంది ఫుల్‌టైమ్‌ బౌలర్ల సేవలు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ప్రయోగం చేస్తే పార్ట్‌ బౌలర్‌గా ఎవరు పనికొస్తారో తెలుస్తుందని అలా చేశా. దీనికి తోడు ఈ మ్యాచ్‌లో మా పేసర్లు అనవసరమైన వైడ్ యార్కర్లు వేశారు. అందుకే పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్లుగా నేను, గిల్‌, స్కై బరిలోకి దిగాం అని అన్నాడు. 

మరిన్ని వార్తలు