CWC 2023: షాకింగ్‌ న్యూస్‌.. హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయిన శుభ్‌మన్‌ గిల్‌..?

10 Oct, 2023 08:40 IST|Sakshi

టీమిండియాకు షాకింగ్‌ న్యూస్‌. గత కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌.. ప్లేట్లెట్స్‌ స్వల్పంగా తగ్గిపోవడంతో చెన్నైలోని కావేరీ హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం గిల్‌ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ కోసం టీమిండియా న్యూఢిల్లీకి బయల్దేరగా గిల్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చెన్నైలోనే ఉండిపోయాడు. ప్లేట్లెట్స్‌ కౌంట్‌ పెరిగాక అతను తిరిగి భారత శిబిరంలో జాయిన్‌ కానున్నట్లు సమాచారం. గిల్‌ పూర్తిగా కోలుకునేంత వరకు టీమిండియాతోనే ఉండాలని నిర్ణయించకున్నాడని, అతను విశ్రాంతి కోసం ఇంటికి వెళ్లేందుకు కూడా ఇష్టపడలేదని బీసీసీఐకి చెందిన కీలక వ్యక్తి ఒకరు తెలిపారు.

గిల్‌.. అక్టోబర్‌ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని సదరు అధికారి ధీమాగా చెప్పాడు. కాగా, డెండ్యూ ఫీవర్‌ కారణంగా శుభ్‌మన్‌ గిల్‌ వరల్డ్‌కప్‌లో ఇప్పటికే ఆసీస్‌తో కీలక మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల నేపథ్యంలో అతను రేపు (అక్టోబర్‌ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా దూరమయ్యేలా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ తర్వాత పాక్‌తో మ్యాచ్‌కు ముందు రెండు రోజులు గ్యాప్‌ ఉండటంతో గిల్‌ పూర్తిగా కోలుకుంటాడని భారత క్రికెట్‌ అభిమానులంతా ఆశిస్తున్నారు.

ఇటీవలికాలంలో భీకర ఫామ్‌లో ఉన్న గిల్‌ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అయినప్పటికీ విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ లాంటి స్టార్లు ఆ లోటును పూడుస్తున్నారు. ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుపోయిన టీమిండియాను విరాట్‌, రాహులే గట్టెక్కించారు. ఒక వేళ ఈ మ్యాచ్‌లో గిల్‌ ఉండివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. టీమిండియా స్వల్ప లక్ష్య ఛేదనకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. ఏదిఏమైనప్పటకీ గిల్‌ డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకుని త్వరలో బరిలోకి దిగాలని ఆశిద్దాం.

ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌-2023లో ఇవాళ (అక్టోబర్‌ 10) రెండు మ్యాచ్‌లు జరుగనున్న విషయం తెలిసిందే. ఉదయం 10:30 గంటల నుంచి ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌లు ధర్మశాల వేదికగా తలపడనుండగా.. హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా మాధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో శ్రీలంక-పాకిస్తాన్‌ జట్లు పోటీపడతాయి.

‘సాక్షి’ తెలుగు న్యూస్‌ కోసం వాట్సాప్‌ చానల్‌ను ఫాలో అవ్వండి

మరిన్ని వార్తలు