CWC 2023: ఇంకా తేల్చుకోలేదు... అహర్నిశలు పనిచేశా

21 Nov, 2023 03:56 IST|Sakshi

 భారత జట్టు హెడ్‌ కోచ్‌గా కొనసాగడంపై ద్రవిడ్‌ వ్యాఖ్య 

అహ్మదాబాద్‌: టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలా లేదంటే ముగించుకోవాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. బీసీసీఐ ఆయనతో కుదుర్చుకున్న రెండేళ్ల కాంట్రాక్టు నవంబర్‌ 19న వరల్డ్‌కప్‌ ఫైనల్‌తో ముగిసింది. టైటిల్‌ పోరులో పరాజయం అనంతరం భారమైన హృదయంతో ద్రవిడ్‌ మీడియా సమావేశానికి వచ్చాడు. నిరాశను దిగమింగి జట్టు ప్రదర్శన, ఫైనల్‌ పరాజయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు.

‘కొంతకాలంగా నేను పూర్తిగా ప్రపంచకప్‌పైనే దృష్టి పెట్టాను. జట్టు సన్నద్ధత కోసమే అహర్నిశలు పనిచేశాను. ఇది కాకుండా మరో ఆలోచనేది నేను చేయలేదు. భవిష్యత్‌ ప్రణాళికలపై ఆలోచించడానికి కూడా నేను సమయం వెచ్చించలేదు. నా రెండేళ్ల పదవీకాలంలోని జయాపజయాలు, ఘనతలు, విశేషాలపై విశ్లేషించుకోవడం లేదు’ అని 50 ఏళ్ల ద్రవిడ్‌ వివరించాడు.

‘అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా పనిచేయడం చాలా బాగా అనిపించింది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌ మార్గదర్శనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. జట్టు కోసం, ప్రపంచకప్‌ కోసం నాయకుడిగా రోహిత్‌ శర్మ ఎంతో శ్రమించాడు. మున్ముందు భారత హెడ్‌ కోచ్‌గా కొనసాగడంపై ఏ నిర్ణయం తీసుకోని నేను 2027 వన్డే ప్రపంచకప్‌పై ఏం మాట్లాడగలను. అప్పటికి జట్టులో ఎవరు ఉంటారో... ఏవరు పోతారో ఎవరికీ తెలియదు. అలాంటి దానిపై స్పందించడం తగదు’ అని ద్రవిడ్‌ వివరించాడు.  

మరిన్ని వార్తలు