T20 WC ENG Vs PAK Final: ప్రతిష్టాత్మక ఫైనల్‌ ​కోసం రూల్స్‌ సవరించిన ఐసీసీ!

12 Nov, 2022 17:04 IST|Sakshi

క్రికెట్‌ అభిమానులు నెల రోజుల నుంచి ఎంజాయ్‌ చేస్తున్న టి20 ప్రపంచకప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇన్నాళ్లు ఫోర్లు, సిక్సర్ల వర్షంతో పాటు వరుణుడి జడివానల్లోనూ తడిసిన అభిమానులకు కిక్కు దిగిపోనుంది. రేపు(నవంబర్‌ 13న) పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ మధ్య మెల్‌బోర్న్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది.

అయితే ముందు నుంచి చెప్పుకుంటున్నట్లు ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న రోజున వర్షం పడే సూచనలు 85 శాతం ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అయితే నాకౌట్‌ దశలో జరిగే మ్యాచ్‌లకు రిజర్వ్‌ డేను కేటాయిస్తారు. దీంతో ఫలితం వచ్చే అవకాశాలుంటాయి. అయితే రిజర్వ్‌ డే కూడా వర్షంలో కొట్టుకుపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తారు. అలా చేస్తే ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌పై ఉన్న జోష్‌ తగ్గిపోతుంది. ఇలా సంయుక్త విజేతలుగా ప్రకటించడం ద్వారా టోర్నీ ఆఖర్లో కళ తప్పినట్లవుతుందని భావించిన ఐసీసీ శనివారం.. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం రూల్స్‌ను సవరించింది.

అయితే ఆ రూల్స్‌ కేవలం మ్యాచ్‌ వరకు మాత్రమే పరిమితం. మరి ఐసీసీ సవరించిన కొత్త రూల్‌ ఏంటంటే.. రిజర్వ్‌ డే రోజున నిర్ణీత సమయంలో వర్షం తగ్గకపోతే.. మరో రెండు గంటలు అదనంగా కేటాయించనున్నారు. ఒకవేళ ఈ రెండు గంటలు ఎలాంటి వర్షం లేకపోతే 10 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. ఇది కూడా సాధ్యపడకపోతే అప్పుడు ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారని ఐసీసీ పేర్కొంది. ఇప్పటికే ఫైనల్‌ జరగనున్న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌(ఎంసీజీ)కి ఉత్తర్వులు పంపామని.. ఆ దిశగా వారు ప్రణాళికను సిద్ధం చేస్తారని తెలిపింది. 

''వర్షం అడ్డుపడినా సాధ్యమైనంత వరకు ఫైనల్‌ మ్యాచ్‌ను నిర్వహించాలనే సంకల్పంతో ఉ‍న్నాం. అందుకే నవంబర్‌ 13న వర్షంతో మ్యాచ్‌ జరగకపోతే రిజర్వ్‌ డే అయిన నవంబర్‌ 14న మ్యాచ్‌ కొనసాగిస్తాము. అప్పటికి వర్షం అంతరాయం కలిగిస్తే మరో రెండు గంటలు మ్యాచ్‌ జరిగేందుకు అదనంగా సమయం కేటాయించాం. అప్పటికి ఫలితం రాకుండా వరుణుడు అడ్డుపడితే మాత్రం ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తాం. ఇది చివరి ఆప్షన్‌ మాత్రమే. కానీ ఇలా జరగడం మాకు ఇష్టం లేదు. కచ్చితంగా ఫైనల్‌ మ్యాచ్‌ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం'' అంటూ టోర్నీ నిర్వాహుకులు పేర్కొన్నారు.

చదవండి: T20 WC: టీమిండియాకు వచ్చిన ప్రైజ్‌మనీ ఎంతంటే?

మరిన్ని వార్తలు