ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌

15 Sep, 2022 15:51 IST|Sakshi
ఇంగ్లండ్‌ జట్టు

ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై గురువారం అడుగు పెట్టింది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌ 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. కాగా ఇంగ్లండ్‌ చివరిసారిగా 2005లో పాకిస్తాన్‌లో ఆడింది. 2007లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్‌పై ఉగ్రదాడి తర్వాత ఏ జట్టు కూడా పాక్‌లో పర్యటించడానికి ముందుకు రాలేదు.

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ కూడా భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌లో ఇంగ్లండ్‌ అడుగుపెట్టలేదు. 2012, 2015లో యూఏఈ వేదికగా ఇరు జట్ల మధ్య సిరీస్‌లు జరిగాయి, కాగా గత ఐదు ఏళ్లలో పరిస్థితులు సద్దుమణగడంతో అంతర్జాతీయ జట్లు పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది టీ20 ప్రపంచకప్‌ ముందు ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించాల్సింది. అయితే ఆటగాళ్ల భద్రత దృష్ట్యా అఖరి నిమిషంలో పాక్‌ పర్యటను  ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు రద్దు చేసింది.

కాగా టీ20 ప్రపంచకప్‌-2021 ముగిసిన తర్వాత  ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు దుబాయ్‌లో సమావేశమయ్యారు. 2022 ఏడాది మధ్యలో ఇంగండ్‌ జట్టు పాక్‌లో పర్యటించి ఏడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆడేందుకు ఈసీబీ ఒప్పందంకుదర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగానే ఇంగ్లండ్‌ జట్టు పాక్‌ గడ్డపై అడుగుపెట్టింది.
భారీ భద్రత
కరాచీ విమానాశ్రయానికి చేరుకున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లను భారీ భద్రత నడుమ హాటల్‌కు తరలించారు. ఇరు జట్లు మధ్య మ్యాచ్‌ జరిగే సమయంలో జట్టు బస చేస్తున్న హాటల్‌తో పాటు కరాచీ నేషనల్ స్టేడియం వద్ద రోడ్లు మొత్తం బ్లాక్‌ చేయనున్నట్లు పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా హాటల్‌తో పాటు స్టేడియం వద్ద కూడా సాయుధ బలగాలను భారీగా మోహరించినట్లు పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.

7టీ20ల సిరీస్‌
పాకిస్తాన్‌తో ఇంగ్లండ్‌ ఏడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఈ టీ20 సిరీస్‌ సెప్టెంబర్‌ 20 నుంచి ఆక్టోబర్‌2 వరకు జరగనుంది. ఈ సిరీస్‌లోని తొలి నాలుగు మ్యాచ్‌లు కరాచీ నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. అఖరి మూడు టీ20లకు లాహోర్‌లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

చదవండి: T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్‌.. యువ బౌలర్‌ ఎంట్రీ

>
మరిన్ని వార్తలు