PAK Tour Of AUS: డబుల్‌ సెంచరీతో చెలరేగిన పాక్‌ కొత్త కెప్టెన్‌

7 Dec, 2023 08:33 IST|Sakshi

నూతనంగా ఎంపిక చేయబడిన పాకిస్తాన్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే అజేయ డబుల్‌ సెంచరీతో (201) చెలరేగాడు. మూడు టెస్ట్‌ మ్యాచ్‌ల ఆసీస్‌ పర్యటనలో భాగంగా ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌తో నిన్న (డిసెంబర్‌ 6) మొదలైన నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో మసూద్‌ కెప్టెన్స్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

మసూద్‌తో పాటు అబ్దుల్లా షఫీక్‌ (38), మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (40), సర్ఫరాజ్‌ అహ్మద్‌ (41) ఓ మోస్తరుగా రాణించడంతో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (9), సౌద్‌ షకీల్‌ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ప్రైమ్‌ మినిస్టర్‌ ఎలెవెన్‌ బౌలర్లలో జోర్డన్‌ బకి​ంగ్హమ్‌ 5 వికెట్లతో విజృంభించగా.. స్టీకిటీ, మెక్‌ ఆండ్రూ, టాడ్‌ మర్ఫీ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఈ మ్యాచ్‌ అనంతరం డిసెంబర్‌ 14 నుంచి 18 వరకు పెర్త్‌లో తొలి టెస్ట్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 26-30 వరకు మెల్‌బోర్న్‌లో రెండో టెస్ట్‌.. వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది. 

ఇదిలా ఉంటే, భారత్‌ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అనంతర పరిణామాల్లో టెస్ట్‌ జట్టుకు షాన్‌ మసూద్‌, టీ20 జట్టుకు షాహీన్‌ అఫ్రిది కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. పాక్‌ క్రికెట్‌ బోర్డు టీ20లకు కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది.   

>
మరిన్ని వార్తలు