సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్‌ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్‌ వా

1 Jan, 2024 16:08 IST|Sakshi
టీమిండియాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న సౌతాఫ్రికా

టెస్టు క్రికెట్‌ను అంతం చేసే కుట్ర!

సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు(సీఎస్‌ఏ) తీరును ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌ వా తప్పుబట్టాడు. జాతీయ జట్టు కంటే వాళ్లకు ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఎక్కువైపోయిందంటూ మండిపడ్డాడు. తనే గనుక న్యూజిలాండ్‌ క్రికెట్‌ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా సౌతాఫ్రికా జట్టు యాజమాన్యానికి తగిన విధంగా బుద్ధి చెప్పేవాడినంటూ ఘాటుగా విమర్శించాడు.

కాగా న్యూజిలాండ్‌తో ఫిబ్రరిలో జరుగనున్న టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా ఇటీవల జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులోని 14 మంది సభ్యుల్లో దాదాపు అందరూ కొత్త వారే. కెప్టెన్‌ నీల్‌ బ్రాండ్‌ కూడా పెద్దగా పరిచయం లేని పేరు.

సీనియర్లంతా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పాల్గొనున్న నేపథ్యంలో బోర్డు ఈ మేరకు అనామక ఆటగాళ్లను కివీస్‌ పర్యటనకు పంపేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై స్పందించిన ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ స్టీవ్‌ వా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి సహా బీసీసీఐ, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

టెస్టు క్రికెట్‌కు చరమగీతం పాడేలా చర్యలకు పూనుకుంటున్న సౌతాఫ్రికా క్రికెట్‌ను హెచ్చరించాల్సిన అవసరం మీకు లేదా అంటూ ప్రశ్నించాడు. ‘‘సౌతాఫ్రికాకు టెస్టు గురించి పట్టదు. భవిష్యత్తులో తమ ఆటగాళ్లు కేవలం సొంతగడ్డపై జరిగే లీగ్‌ క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తారని సంకేతాలు ఇస్తోంది.

ఒకవేళ నేనే గనుక న్యూజిలాండ్‌ స్థానంలో ఉండి ఉంటే.. ఈ సిరీస్‌ను రద్దు చేయించేవాడిని. అసలు కివీస్‌ జట్టు ఈ అనామక టీమ్‌తో ఆడేందుకు ఎందుకు ఒప్పుకుందో తెలియడం లేదు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ పట్ల ఇంత అమర్యాదగా ప్రవర్తించినా వాళ్లు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు.

టెస్టు క్రికెట్ అంతం కాబోతోందనడానికి ఇలాంటివి సంకేతాలు. ఐసీసీతో పాటు ఇండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులు ఏం చేస్తున్నాయి? వాళ్లు ఈ విషయంలో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలి.

చరిత్ర, సంప్రదాయానికి ఎంతో కొంత విలువ ఉంటుంది కదా? కేవలం డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తే.. సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌, గ్రేస్‌, సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ వంటి దిగ్గజాల లెగసీని కొనసాగించేవారెవరు? 

టెస్టు క్రికెట్‌ ఫీజుల విషయంలో ఆయా బోర్డులు ఆటగాళ్ల పట్ల వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణం. అందుకే చాలా మంది ఆటగాల్లు టీ10, టీ20 లీగ్‌ల వైపు చూస్తున్నారు’’ అని సిడ్నీ హెరాల్డ్‌తో స్టీవ్‌ వా వ్యాఖ్యానించాడు. 

సౌతాఫ్రికాతో పాటు వెస్టిండీస్‌, పాకిస్తాన్‌ జట్లు కూడా ఇలాంటి ధోరణినే అవలంబిస్తూ.. అనామక జట్లను విదేశీ పర్యటనలకు పంపిస్తున్నాయని స్టీవ్‌ వా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌ కారణంగా జాతీయ జట్టు టూర్లపై ప్రభావం పడటం ఇది రెండోసారి. గతేడాది టీ20 లీగ్‌ కారణంగా తొలుత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ రద్దు చేసుకోవాలని భావించిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత స్టార్‌ ప్లేయర్లు లేకుండానే సిరీస్‌ను ముగించేసింది. 

ఇక సౌతాఫ్రికా ప్రస్తుతం సొంతగడ్డపై టీమిండియాతో టెస్టు సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. బాక్సిండే టెస్టులో భారత జట్టును చిత్తు చేసిన ప్రొటిస్‌ బుధవారం నుంచి రెండో టెస్టు ఆడనుంది.

చదవండి: ILT20 2024: మరో టీ20 లీగ్‌లో ఎంట్రీ.. దుబాయ్‌ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వార్నర్‌

>
మరిన్ని వార్తలు