CWC 2023: ఆఫ్ఘన్ల విజయాల వెనుక మన "అజేయుడు"

31 Oct, 2023 10:57 IST|Sakshi

ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు వరుస సంచలనాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ ఏడిషన్‌లో తొలుత డిఫెండింగ్‌ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఆఫ్ఘన్లు.. ఆతర్వాత 1992 వరల్డ్‌కప్‌ విన్నర్‌ పాకిస్తాన్‌ను, తాజాగా 1996 వరల్డ్‌ ఛాంపియన్స్‌ శ్రీలంకను మట్టికరిపించారు. పూణే వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో లంకేయులను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆఫ్ఘన్లు.. మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేయాలని ఆశిస్తున్నారు.

ప్రస్తుత వరల్డ్‌కప్‌ ఆఫ్ఘన్లు ఈ తరహాలో రెచ్చిపోవడం వెనుక ఇద్దరు వ్యక్తులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆఫ్ఘన్‌ హెడ్‌ కోచ్‌ జోనాథన్‌ ట్రాట్‌ కాగా.. రెండవ వ్యక్తి ఆ జట్టు మెంటార్‌ ఆజయ్‌ జడేజా. గతంలో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన జడేజా.. ఆఫ్ఘన్లకు క్రికెట్‌తో పాటు క్రికెటేతర విషయాల్లోనూ తోడ్పడుతూ వారి విజయాలకు దోహదపడుతున్నాడు. 

వాస్తవానికి జట్టులో మెంటార్‌ పాత్ర నామమాత్రమే అయినా జడేజా మాత్రం ఆఫ్ఘన్లకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. వన్‌ టు వన్‌ కోచింగ్‌తో పాటు జట్టు వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తన టైమ్‌లో బెస్ట్‌ ఫీల్డర్‌గా చలామణి అయిన జడేజా.. ఆఫ్ఘన్లకు ఫీల్డింగ్‌ మెళకువలు కూడా నేర్పుతున్నాడు. అలాగే భారత్‌లో స్థితిగతులపై అవగాహన లేని చాలామంది ఆఫ్ఘన్‌ క్రికెటర్లకు తోడ్పాటునందిస్తున్నాడు. జడేజా మెంటార్‌షిప్‌లో ఆఫ్ఘన్లు మున్ముందు మరిన్ని సంచలనాలు నమోదు చేసే అవకాశం ఉంది.

కాగా, 52 ఏళ్ల జడేజా 1992-2000 మధ్యలో టీమిండియా తరఫున 15 టెస్ట్‌ మ్యాచ్‌లు, 196 వన్డేలు ఆడాడు. జడేజా టీమిండియాకు 13 వన్డేల్లో నాయకత్వం వహించాడు. 15 టెస్ట్‌ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 576 పరుగులు చేసిన జడేజా.. 196 వన్డేల్లో 6 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 5359 పరుగులు చేశాడు. 

మరిన్ని వార్తలు