#SRHvsMI: చెత్త కెప్టెన్సీ.. హార్దిక్‌పై మాజీ పేసర్ల విమర్శలు

28 Mar, 2024 15:38 IST|Sakshi
బుమ్రాతో పాండ్యా (PC: IPL)

క్వెనా మఫాకా నాలుగు ఓవర్లలో 66 పరుగులు- నో వికెట్‌.. హార్దిక్‌ పాండ్యా నాలుగు ఓవర్లలో 46 రన్స్‌- ఒక వికెట్‌.. గెరాల్డ్‌ కోయెట్జి నాలుగు ఓవర్లలో 57 పరుగులు- ఒక వికెట్‌... పీయూశ్‌ చావ్లా రెండు ఓవర్లలో 34 పరుగులు- ఒక వికెట్‌.. షామ్స్‌ ములానీ రెండు ఓవర్లు 33 పరుగులు- నో వికెట్‌..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ బౌలర్ల ప్రదర్శన ఇది. ఈ మ్యాచ్‌లో కాస్త మెరుగ్గా బౌలింగ్‌ చేసింది ఎవరైనా ఉన్నారంటే.. ముంబై ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఒక్కడే.. తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌ 36 పరుగులతో సరిపెట్టాడు.

మ్యాచ్‌ ఫలితాన్ని పక్కనపెడితే.. పరుగుల వరద పారుతున్న పిచ్‌పై తన అనుభవం, నైపుణ్యాలు ఏమిటో బుమ్రా మరోసారి నిరూపించుకున్నాడు. మరోవైపు.. బుమ్రాను కాదని అనామక బౌలర్‌తో ఫస్ట్‌ ఓవర్‌ వేయించిన కెప్టెన్‌ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనామక బౌలర్‌తో అటాక్‌ను ఆరంభించడం పట్ల ఇర్ఫాన్‌ పఠాన్‌, బ్రెట్‌ లీ వంటి మాజీ పేసర్లు హార్దిక్‌ పాండ్యాపై మండిపడ్డారు. ఐపీఎల్‌ ఎక్స్‌పర్ట్‌ బ్రెట్‌ లీ జియో సినిమా షోలో మాట్లాడుతూ.. ‘‘జస్‌ప్రీత్‌ బుమ్రాతో తొలి ఓవర్‌ వేయించకుండా ముంబై ఇండియన్స్‌ మరోసారి తప్పుచేసింది.

గత మ్యాచ్‌లోనూ ఇలాగే చేశారు. బుమ్రాను ఆరంభంలోనే బరిలోకి దింపితే మ్యాచ్‌ మరోలా ఉండేది’’ అని అభిప్రాయపడ్డాడు. మరోవైపు.. ఇర్ఫాన్‌ పఠాన్‌ ఎక్స్‌ వేదికగా స్పందించాడు. ‘‘సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో పాండ్యా కెప్టెన్సీ అత్యంత సాధారణంగా ఉంది.

బుమ్రాను ఆలస్యంగా తీసుకువరావడం ఎవరి ఊహకు అందనది. ఇక లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌ బ్యాటర్లంతా 200 స్ట్రైక్‌రేటుతో ఆడుతుంటే.. కెప్టెన్‌ మాత్రం 120 స్ట్రైక్‌రేటుతో ఆడటం ఏమిటో?’’ అంటూ పాండ్యా ఆట తీరు, కెప్టెన్సీపై వ్యంగ్యస్త్రాలు సంధించాడు.

కాగా ఉప్పల్‌ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై.. సన్‌రైజర్స్‌ చేతిలో 31 పరుగులతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పాండ్యా ఒక వికెట్‌ తీయడంతో పాటు.. 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు.

Election 2024

మరిన్ని వార్తలు