Sakshi News home page

Hardik Pandya: మేము చాలా కష్టపడ్డాము.. మా విజయానికి కారణం అతడే

Published Sun, Apr 7 2024 9:32 PM

Hardik Pandya Denies Problems In MI Camp After 1st Win In IPL 2024 - Sakshi

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ముంబై బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(49) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. టిమ్‌ డేవిడ్‌(45), ఇషాన్‌ కిషన్‌(42), హార్దిక్‌ పాండ్యా(39), రొమారియో షెపర్డ్(38) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఢిల్లీ కూడా పోరాడింది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.

ఢిల్లీ బ్యాటర్లలో ట్రిస్టన్‌ స్టబ్స్‌(25 బంతుల్లో 71, 7 సిక్స్‌లు, 3 ఫోర్లు) అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడితో పాటు పృథ్వీషా(66) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. 

ఇక ఈ ఏడాది సీజన్‌లో తొలి విజయంపై మ్యాచ్‌ అనంతరం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. మొదటి విజయం కోసం చాలా కష్టపడ్డామని హార్దిక్‌ తెలిపాడు.

"ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి  మేము చాలా కష్టపడ్డాము. తొలి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనప్పటికి మేము ఎటువంటి దిగులు చెందలేదు. ఎందుకంటే ఒక జట్టుగా మాపై మాకు నమ్మకం ఉంది. ఈ మ్యాచ్‌లో మేము పాజిటివ్‌ మైండ్‌ సెట్‌తో బరిలోకి దిగాం. మా ప్రణాళికలను సరిగ్గా అ‍మలు చేశాం.  

ఈ మ్యాచ్‌తో పాటు ప్రతీ మ్యాచ్‌లోనూ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాం. అయితే మా 12 ప్లేయర్ కాంబినేషన్ సెట్ అవ్వడం చాలా ముఖ్యం. మా డ్రెసింగ్‌ రూమ్‌ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఒకరు ఒకరు సపోర్ట్‌ చేసుకుంటూ ఉంటాం. ఒక్క విజయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశాం. అది మాకు ఈ రోజు వచ్చింది.

ఇక మ్యాచ్‌లో ఓపెనర్లు మాకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌లో ప్లేలో 70 పరుగులు పైగా సాధించడం అంత సులభం కాదు. ప్రతీ ఒక్కరు ఈ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రొమారియో తన పవర్‌ చూపించాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్‌ కోసం ఎంత చెప్పుకున్న తక్కువే.

అతడే మాకు విజయాన్ని అందించాడు. రోమారియో ఆడిన ఇన్నింగ్సే మా విజయానికి, ఢిల్లీ ఓటమి ప్రధాన కారణం. ఇక  ఈ మ్యాచ్‌లో నేను బౌలింగ్‌ చేయాల్సిన అవసరం రాలేదు. కచ్చితంగా జట్టుకు అవసరమైనప్పుడు నేను బౌలింగ్‌ చేస్తా" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో హార్దిక్‌ పేర్కొన్నాడు.
 

Advertisement
Advertisement