#Hardik Pandya: ఏంటి హార్దిక్ ఇది.. అంపైర్‌ను కూడా వ‌ద‌ల‌వా! వీడియో వైర‌ల్‌

28 Mar, 2024 17:12 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా(PC:BCCI/IPL.com)

టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా  మ‌రోసారి భార‌త క్రీడా వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాడు. ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన హార్దిక్ పాండ్యా.. త‌న మార్క్ చూపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల్లో తన సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ ఓట‌మి పాలైంది.

తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఓట‌మి పాలవ్వ‌గా.. తాజాగా స‌న్‌రైజ‌ర్స్ జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో హార్దిక్ కెప్టెన్సీ ప‌రంగానే కాకుండా..  వ్య‌క్తిగ‌త ప్ర‌దర్శ‌న ప‌రంగా నిరాశ‌ప‌రిచాడు. ఈ క్ర‌మంలో అత‌డిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. అత‌డి చెత్త కెప్టెన్సీ వ‌ల్లే ముంబై ఓట‌మి పాలైంద‌ని మాజీ క్రికెట‌ర్లు సైతం మండిపడుతున్నారు.

అంపైర్‌పై సీరియ‌స్‌..
కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ త‌న స‌హ‌నాన్ని కోల్పోయాడు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ సంద‌ర్భంగా హార్దిక్.. అంపైర్‌పై కోపంతో ఊగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మొద‌టి ఓవ‌ర్ నుంచే వీరిద్ద‌రి ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రి దూకుడును క‌ట్ట‌డి చేయడానికి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. పేస‌ర్‌ గెరాల్డ్ కోయెట్జీని ఎటాక్‌లోకి తీసువచ్చాడు.

ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ ఆరో ఓవ‌ర్ బౌలింగ్ చేయ‌డానికి వ‌చ్చిన కోయెట్జీ.. తొలి బంతినే అభిషేక్ శ‌ర్మ‌కు హై ఫుల్ టాస్‌గా సంధించాడు. ఇది చూసిన లెగ్‌ అంపైర్ హైట్ నోబాల్‌గా ప్ర‌క‌టించాడు. లెగ్ అంపైర్ నిర్ణ‌యం ప‌ట్ల హార్దిక్ పాండ్యా ఆసంతృప్తి వ్య‌క్తం చేశాడు. ఈ క్ర‌మంలో అంపైర్‌తో హార్దిక్ వాగ్వాదానికి దిగాడు.

అంపైర్ వివ‌ర‌ణ‌ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికి పాండ్యా మాత్రం వినిపించుకోలేదు. త‌న రివ్యూకు వెళ‌తాన‌ని హార్దిక్ ప‌ట్టుబ‌ట్టాడు. అంపైర్‌లు చేసేదిమి లేక అత‌డి కోరిక ప్ర‌కారం డీఆర్ఎస్‌కు వెళ్లారు. థ‌ర్డ్ అంపైర్ సైతం నో బాల్‌గానే ప్ర‌క‌టించింది. దీంతో హార్దిక్‌కు ఒక్క‌సారిగా దిమ్మ తిరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సరి కొత్త చ‌రిత్ర‌..
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ 31 పరుగుల తేడాతో ఓట‌మి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (62; 24 బంతుల్లో) మొదలుపెట్టిన విధ్వంసాన్ని అభిషేక్ శర్మ (63; 23 బంతుల్లో) కొనసాగించాడు. మార్క్‌రమ్ (42 నాటౌట్‌; 28 బంతుల్లో)తో కలిసి క్లాసెన్ (80 నాటౌట్‌; 34 బంతుల్లో) ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చాడు.

ఐపీఎల్ చరిత్ర‌లో అత్య‌ధిక స్కోర్ సాధించిన జ‌ట్టుగా ఎస్ఆర్‌హెచ్ రికార్డుల‌కెక్కింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ముంబై 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. తిలక్ వర్మ (64; 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42 నాటౌట్‌; 22 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34; 13 బంతుల్లో) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కాగా ఈ మ్యాచ్‌లో రెండు జట్లు క‌లిపి ఏకంగా 523 ప‌రుగులు న‌మోదు చేశాయి.

Election 2024

మరిన్ని వార్తలు