అప్పుడు ద్రవిడ్‌ నా కోసం రెండు గంటలు ఎదురుచూశాడు.. ఇప్పుడు టీమిండియా..: షోయబ్‌ మాలిక్‌

31 Oct, 2023 15:38 IST|Sakshi

Shoaib Malik Comments On Rahul Dravid: పాకిస్తాన్‌ వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్‌ టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనదని కొనియాడాడు. తన పట్ల ద్రవిడ్‌ వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనమంటూ గత జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నాడు.

పాకిస్తాన్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 1999లో అడుగుపెట్టిన షోయబ్‌ మాలిక్‌ ఇప్పటి వరకు.. 34 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1898.. 7534.. 2435 పరుగులు సాధించడంతో పాటు.. 32.. 158.. 28 వికెట్లు పడగొట్టాడు.

ఈ క్రమంలో తన సుదర్ఘీ కెరీర్‌లో వ్యక్తిగత రికార్డులెన్నో సాధించిన మాలిక్‌.. ఎత్తుపళ్లాలు కూడా చవిచూశాడు. పాక్‌ కెప్టెన్‌గానూ పనిచేసిన అనుభవం ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సొంతం. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన 41 ఏళ్ల షోయబ్‌ మాలిక్‌.. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో భాగమవుతూ తన కెరీర్‌ కొనసాగిస్తున్నాడు.

ఆరోజు అంతా ఒకే ఫ్లైట్‌లో ఉన్నాం
తాజాగా పాకిస్తాన్‌ స్పోర్ట్స్‌-ఏ చానెల్‌తో మాట్లాడిన షోయబ్‌ మాలిక్‌.. వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా జైత్రయాత్ర వెనుక హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పాత్ర కీలకమని పేర్కొన్నాడు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడైనప్పటికీ ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో ఉంటాడని.. అదే ఆయనను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టిందంటూ ప్రశంసలు కురిపించాడు.

ఈ మేరకు పాత సంఘటన గుర్తుచేసుకుంటూ.. ‘‘మేము పాకిస్తాన్‌ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్తున్నాం. ఆరోజు ఇండియా అండర్‌-19 క్రికెట్‌ జట్టు కూడా మాతో పాటే అదే విమానంలో ప్రయాణం చేస్తోంది. అప్పుడు రాహుల్‌ ద్రవిడ్‌ అండర్‌-19 టీమ్‌కు కోచ్‌గా ఉన్నాడు.

నా కోసం ఆయన రెండు గంటలు ఎదురుచూశాడు
విమానంలో నాకు బాగా నిద్రపట్టేసింది. నాతో మాట్లాడేందుకు ద్రవిడ్‌ దాదాపు రెండు గంటల పాటు ఎదురుచూశాడు. నేను నిద్రలేచిన తర్వాత  .. ‘ఎన్నోసార్లు ఆటుపోట్లు ఎదుర్కొన్న తర్వాత కూడా నువ్వు తిరిగి ఎలా పునరాగమనం చేయగలిగావు. 

నిన్ను ముందుకు నడిపే స్ఫూర్తి మంత్రం ఏమిటి?’ అని ద్రవిడ్‌ నన్ను అడగాలనుకున్నానని చెప్పాడు. తాను అప్పుడు అండర్‌-19 టీమ్‌ కోచ్‌గా ఉన్నాను కాబట్టి ఇలాంటివి యువ ప్లేయర్లకు చెప్పడం ఎంతో ముఖ్యమని నాతో అన్నాడు.

ద్రవిడ్‌కు ఈగో అ‍స్సలు ఉండదు
నేను ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటంటే.. ద్రవిడ్‌కు అస్సలు ఈగో ఉండదు. ఎవరి నుంచి ఏదైనా నేర్చుకోవాలని భావిస్తే తప్పక అడిగి తెలుసుకుంటాడు. తన కెరీర్‌లో ఆయన ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాడు. 

ఆటగాడిగా ఎంతో అనుభవం ఉంది. అయినా, ఎప్పుటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతాడు. అందుకే ఈరోజు టీమిండియా ఈ స్థాయిలో ఉంది’’ అని షోయబ్‌ మాలిక్‌.. ద్రవిడ్‌ వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తాడు. కాగా రాహుల్‌ ద్రవిడ్‌ మార్గదర్శనంలో టీమిండియా వన్డే వరల్డ్‌కప్‌-2023 ట్రోఫీ గెలిచే దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే.   

చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన షాహిన్‌ ఆఫ్రిది.. తొలి బౌలర్‌గా రికార్డు
WC 2023: గెలుపు జోష్‌లో ఉన్న టీమిండియాకు మరో గుడ్‌న్యూస్‌!

మరిన్ని వార్తలు