CWC 2023 IND VS NZ Semi Final 1: మా వాళ్లు వీరోచితంగా పోరాడారు.. గర్వంగా ఉంది: కేన్‌ విలియమ్సన్‌

16 Nov, 2023 09:42 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్‌ నాలుగోసారి ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రవేశించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ కివీస్‌పై పైచేయి సాధించి, గత వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఎదురైన పరాభవాని​కి ప్రతీకారం తీర్చుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కోహ్లి (113 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్‌ (70 బంతుల్లో 105; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), శుభ్‌మన్‌ (66 బంతుల్లో 80 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (29 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రాహుల్‌ (20 బంతుల్లో 39 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసింది. 

అనంతరం ఛేదనలో అద్బుతమైన పోరాటపటిమ కనబర్చిన న్యూజిలాండ్‌ చివరి వరకు గెలుపు కోసం ‍ప్రయత్నించి విఫలమైంది. డారిల్‌ మిచెల్‌ (134), విలియమ్సన్‌ (69), గ్లెన్‌ ఫిలిప్స్‌ (41) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరు మినహా జట్టులోని మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటై, మెగా టోర్నీ నుంచి మరోసారి రిక్తహస్తాలతో నిష్క్రమించింది.  

మ్యాచ్‌ అనంతరం న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ముందుగా టీమిండియాకు అభినందనలు. వారు గొప్ప క్రికెట్ ఆడారు. మా వాళ్లు సైతం అద్భుతంగా పోరాడారు. మా పోరాటం​ పట్ల గర్వంగా ఉంది. మరోసారి నాకౌట్‌ కావడం నిరాశపరిచింది. శక్తివంచన లేకుండా ప్రయత్నించాం. టీమిండియా మాకంటే బెటర్‌ గేమ్‌ ఆడింది. అదో టాప్ క్లాస్ జట్టు. ప్రపంచ స్థాయి బ్యాటర్లంతా ఆ జట్టులోనే ఉన్నారు. వారందరూ మాపై ప్రతాపం చూపారు. 398 పరుగుల స్కోర్‌ను ఛేజ్‌ చేయడం ఆషామాషీ విషయం కాదు. అయినా మేం అద్భుతంగా పోరాడాం. ఛేజింగ్‌ చాలా కష్టంగా ఉండింది.

భారత బౌలర్లకు క్రెడిట్‌ దక్కుతుంది. వారు మై పైచేయి సాధించారు. మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. జట్టుగా మాకు ఆట పట్ల నిజమైన నిబద్ధత ఉంది. గెలుపు కోసం చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేశాం. ఈ ఎడిషన్‌లో రచిన్, మిచెల్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. బౌలర్లు కాస్త తడబడ్డారు. అంతిమంగా మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ముంబై ప్రేక్షకులు అద్భుతం. వారు మమ్మల్ని సొంత ఆటగాళ్లలా ఆదరించారు. ఇక్కడికి రావడం ప్రత్యేకం. భారతదేశం ఆతిథ్యం అత్యద్భుతం. 

చదవండి: ఒత్తిడిలోనూ మా వాళ్లు అద్భుతం.. వాళ్లు కూడా బాగా ఆడారు: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు