CWC 2023: పాక్‌ సెమీస్‌కు చేరి భారత్‌తో తలపడాలంటే ఇలా జరగాలి..

7 Nov, 2023 12:35 IST|Sakshi

ప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌లు మరోసారి (సెమీస్‌లో) తలపడే అవకాశాలు మినుకుమినుకుమంటున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణుడి కటాక్షంతో గట్టెక్కి,సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న పాక్‌, తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారీ తేడాతో నెగ్గితే సెమీస్‌కు చేరే ఛాన్స్‌ ఉంటుంది. పాక్‌ సెమీస్‌కు చేరి, భారత్‌తో తలపడాలంటే ఈ ఈక్వేషన్‌తో పాటు మరో రెండు ఈక్వేషన్స్‌ వర్కౌట్‌ అవ్వాల్సి ఉంటుంది.

అవేంటంటే.. న్యూజిలాండ్‌ శ్రీలంక చేతిలో ఓడాలి. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడాలి. ఇలా జరిగితే పాక్‌  10 పాయింట్లతో నాలుగో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న భారత్‌.. నాలుగో ప్లేస్‌లో ఉన్న పాక్‌ సెమీస్‌లో తలపడతాయి. అయితే ఇలా జరగడం​ అంత ఈజీ కూడా కాకపోవచ్చు.

ఒకవేళ పాక్‌.. ఇంగ్లండ్‌పై గెలచి, మరోపక్క న్యూజిలాండ్‌.. శ్రీలంకను మట్టికరిపిస్తే అప్పుడు ఈ ఇరు జట్లలో మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుని భారత్‌తో తలపడుతుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లో ఏదో ఒక జట్టుపై భారీ తేడాతో గెలిచినా ఆ జట్టు కూడా సెమీస్‌ రేసులో నిలుస్తుంది. ఏ ఇబ్బంది లేకుండా పాక్‌ సెమీస్‌కు చేరాలంటే ఆ జట్టు ఇంగ్లండ్‌పై విజయం సాధించి, న్యూజిలాండ్‌ శ్రీలంక చేతిలో ఓడి, ఆఫ్ఘనిస్తాన్‌.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో ఓడితే సరిపోతుంది. 

కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లు ఇదివరకే ఎలిమినేషన్‌కు గురి కాగా.. భారత్‌, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌ రేసులో మూడు, నాలుగు స్థానాల కోసం ఆసీస్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య​ పోటీ నడుస్తుంది.

మరిన్ని వార్తలు