-

IND VS AUS 2nd T20: విధ్వంసానికి పరాకాష్టగా నిలిచిన రింకూ.. నయా మ్యాచ్‌ ఫినిషర్‌ అంటూ జేజేలు

27 Nov, 2023 11:43 IST|Sakshi

టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్‌ పొట్టి ఫార్మాట్‌లో పేట్రేగిపోతున్నాడు. భారత జట్టుకు ఆడే అవకాశం వచ్చిన ప్రతిసారి తన మార్కు ఊచకోతతో విరుచుకుపడుతున్నాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఐదు బంతుల్లో 5 సిక్సర్ల ఫీట్‌తో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ఈ కేకేఆర్‌ బ్యాటర్‌.. టీమిండియాలోకి వచ్చిన అనతి కాలంలోనే మ్యాచ్‌ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తిరువనంతపురం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఆడిన ఇన్నింగ్స్‌తో (9 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) భారత క్రికెట్‌ అభిమానులందరూ రింకూని ధోనితో పోలుస్తున్నారు. టీమిండియాకు నయా మ్యాచ్‌ ఫినిషర్‌ దొరికాడని కొనియాడుతున్నారు. చివరి ఓవర్లలో రింకూ ఆడే షాట్లు చూస్తే మతి పోతుందని జేజేలు కొడుతున్నారు.

నిన్నటి మ్యాచ్‌లో రింకూ స్ట్రయిక్‌రేట్‌ (344.44) చూసి విధ్వంసానికి ఇది పరాకాష్ట అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌ 19వ ఓవర్‌లో సీన్‌ అబాట్‌ బౌలింగ్‌ను తుత్తినియలు (4, 0, 6, 4, 4, 6) చేసిన వైనాన్ని కొనియాడుతున్నారు.  రింకూ భవిష్యత్తులో ధోని అంతటి వాడవుతాడని జోస్యం చెబుతున్నారు. రింకూ.. లోయర్‌ మిడిలార్డర్‌లో టీమిండియాకు దొరికిన తురుపుముక్క అంటూ ఆకాశానికెత్తుతున్నారు.

తాజాగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20ని ఉదహరిస్తూ (ఆఖరి బంతికి సిక్సర్‌) నయా మ్యాచ్‌ విన్నర్‌ అంటూ కితాబునిస్తున్నారు. రింకూ ఆడిన నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లను ప్రస్తావిస్తూ భారత క్రికెట్‌ భవిష్యత్తు స్టార్‌ అంటూ జేజేలు పలుకుతున్నారు. ఈ యువ కెరటం ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తుండటం శుభపరిణామమని అంటున్నారు. 

రింకూ తన టీ20 కెరీర్‌లో చేసిన స్కోర్లు..
38 (21)
37* (15)
22* (14)
31* (9)

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో రింకూ విధ్వంసానికి ముందు భారత టాపార్డర్‌ బ్యాటర్లు సైతం ఆసీస్‌ బౌలర్లను ఊచకోత కోశారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. యశస్వి (25 బంతుల్లో 53; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్‌ (43 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్‌ (10 బంతుల్లో 19; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఛేదనలో ఆసీస్‌ ఆదిలో కాస్త పోటీనిచ్చినప్పటికీ.. ఆతర్వాత చేతులెత్తేసింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్‌ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో భిష్ణోయ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 3 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 
 

మరిన్ని వార్తలు