Rohit Sharma: ఒక్క మ్యాచ్‌కే తప్పించారా? కుల్దీప్‌ను పక్కనపెట్టడానికి కారణమిదే!

7 Dec, 2022 11:33 IST|Sakshi

Ind Vs Ban 2nd ODI Playing XI: బంగ్లాదేశ్‌లో పర్యటనలో భాగంగా అరంగేట్రం చేసిన టీమిండియా యువ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ రెండో వన్డేకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కశ్మీర్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కాగా బంగ్లాతో మొదటి వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌.

ఢాకా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 5 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఈ మధ్యప్రదేశ్‌ బౌలర్‌.. 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగిలిన భారత బౌలర్లతో పోలిస్తే పరుగులు ఎక్కువగానే సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒకే ఒక్క వికెట్‌ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

అహ్మద్‌ను తప్పించి అక్షర్‌కు స్థానం
ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో పోటీలో నిలవాలంటే బుధవారం నాటి మ్యాచ్‌లో రోహిత్‌ సేన తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ సందర్భంగా వెల్లడించాడు. షాబాజ్‌ అహ్మద్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ సేన్‌ స్థానంలో ఉమ్రాన్‌ మాలిక్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. కుల్దీప్‌ సెలక్షన్‌కు అందుబాటులో లేడని.. అందుకే అతడి స్థానాన్ని ఉమ్రాన్‌తో భర్తీ చేసినట్లు పేర్కొన్నాడు.

కారణమిదే!
మొదటి వన్డే సందర్భంగా వెన్నునొప్పితో కుల్దీప్‌ సేన్‌ ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించింది. దీంతో అతడు సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. ఈ మేరకు బీసీసీఐ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

బంగ్లాతో రెండే వన్డే- భారత తుది జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.

చదవండి: Ind Vs Ban 2nd ODI: కచ్చితంగా గెలుస్తాం.. అతడు ప్రపంచంలోనే గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదుగుతాడు!
Ind A Vs Ban A: ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్‌.. బంగ్లా 252 పరుగులకు ఆలౌట్‌

మరిన్ని వార్తలు