ఒక్కడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలిపించలేడు! మీ ఇద్దరూ కూడా కాస్త ఆడాలి: భారత మాజీ క్రికెటర్‌

26 Oct, 2022 15:06 IST|Sakshi

T20 World Cup 2022- India Vs Netherlands: ‘‘విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ అత్యద్భుతం. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్‌ నేనెప్పుడూ చూడలేదు. అయితే ప్రతి మ్యాచ్‌లోనూ కోహ్లి ఒక్కడే జట్టును గెలిపించలేడు కదా. ఇలాంటి కీలక టోర్నీల్లో ఒక్క ఆటగాడిపై ఆధారపడితే అనుకున్న లక్ష్యాలు సాధించలేము’’ అని టీమిండియా మాజీ క్రికెటర్‌, 1983 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన మదన్‌ లాల్‌ అన్నాడు.

ఆ ఇద్దరు విఫలం!
టీ20 ప్రపంచకప్‌-2022లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి విలువైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించిన విషయం తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో గెలుపొందినప్పటికీ ఓపెనింగ్‌ జోడీ వైఫల్యం కలవరపెట్టే అంశంగా పరిణమించింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 8 బంతుల్లో 4 పరుగులు చేసి అవుట్‌కాగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 7 బంతుల్లో 4 రన్స్‌ తీసి పెవిలియన్‌ చేరాడు.

దీంతో భారమంతా మిడిలార్డర్‌పై పడింది. ఈ క్రమంలో కోహ్లి(53 బంతుల్లో 82 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా(37 బంతుల్లో 40 పరుగులు) గనుక బ్యాట్‌ ఝులిపించి ఉండకపోతే ఫలితం వేరేలా ఉండేది. ఈ నేపథ్యంలో మదన్‌ లాల్‌ స్పందిస్తూ... రోహిత్‌, రాహుల్‌లపై విమర్శలు ఎక్కుపెట్టాడు.

మీరు కూడా బ్యాట్‌ ఝులిపించండి!
ఈ మేరకు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి ఆట తీరుకు ఆస్ట్రేలియన్‌ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. పెద్ద గ్రౌండ్‌లలో తను సింగిల్స్‌, రెండు, మూడు పరుగులు తీయగలడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతాడు. మానసికంగా తను బలవంతుడు. ఎప్పుడు ఎలా ఆడాలో తనకో అవగాహన ఉంటుంది.

రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ బ్యాట్‌ ఝులిపించాలి. ప్రతి ఒక్కరు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఆటగాడు హీరో అవుతాడు. కేవలం ఒక్కడిపై ఆధారపడితే కష్టమే’’ అని మదన్‌ లాల్‌ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచకప్‌-2022లో రోహిత్‌ సేన తమ రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో గురువారం తలపడనుంది. 

చదవండి: టీ20లకు కోహ్లి గుడ్‌ బై చెప్పాలి.. ఎందుకంటే! నీ చచ్చు సలహాలు ఆపు! కింగ్‌ ఉంటే మీ ‘ఆట’లు సాగవనా?
టీ20 వరల్డ్‌కప్‌లో పెను సంచలనం.. ఇంగ్లండ్‌కు ‘షాకిచ్చిన పసికూన’.. ఏదైతేనేమి!

Poll
Loading...
మరిన్ని వార్తలు