Ind vs SA: అ‍స్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది: ‘సిక్సర్‌’ సిరాజ్‌

4 Jan, 2024 10:20 IST|Sakshi

Ind vs SA 2nd Test- Siraj Comments: కేప్‌టౌన్‌ టెస్టులో తొలి రోజే ‘సిక్సర్‌’తో సంచలనం సృష్టించాడు టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సౌతాఫ్రికాకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా, యువ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌తో కలిసి ప్రొటిస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించి.. టెస్టుల్లో తొలిసారి తన అత్యుత్తమ గణాంకాలు(6/15) నమోదు చేశాడు.

కీలక వికెట్లు పడగొట్టిన సిరాజ్‌
మొత్తంగా తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఓపెనర్లు ఐడెన్‌ మార్క్రమ్‌(2), కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌(4), టోనీ డీ జోర్జీ(2) రూపంలో బిగ్‌ వికెట్లు దక్కించుకున్న సిరాజ్‌ మియా.. డేవిడ్‌ బెడింగ్‌హాం(12), కైలీ వెరెనె(15), మార్కో జాన్సెన్‌(0)ల వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

మరోవైపు.. బుమ్రా ట్రిస్టన్‌ స్టబ్స్‌(3), నండ్రీ బర్గర్‌(4)లను పెవిలియన్‌కు పంపగా.. ముకేశ్ కుమార్‌ కేశవ్‌ మహరాజ్‌(3), కగిసో రబడ(5) వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా పేసర్ల దెబ్బకు 55 పరుగులకే ఆలౌట్‌ అయింది ఆతిథ్య సౌతాఫ్రికా.

ఆధిక్యంలో రోహిత్‌ సేన
ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన 153 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మళ్లీ బ్యాటింగ్‌కు దిగగా.. ఆట ముగిసే సరికి 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది.

అస్సలు ఊహించలేదు
ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఆట ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన మహ్మద్‌ సిరాజ్‌కు.. ‘‘ఒకేరోజు రెండుసార్లు బౌలింగ్‌ చేయాల్సి వస్తుందని ఊహించారా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలా జరగుతుందని మీరైనా ఊహించారా? లేదు కదా.. మేము కూడా అంతే.

క్రికెట్‌లో ఇవన్నీ సహజమే. ఒకేరోజు మంచి, చెత్త ఇన్నింగ్స్‌ చూశారు’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన అత్యుత్తమ ప్రదర్శనలో సీనియర్‌ బుమ్రా, వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌కు కూడా భాగం ఉందని సిరాజ్‌ తెలిపాడు.

వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది
‘‘ఓవైపు సీనియర్‌ బౌలర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ ఉంటే.. మరోవైపు వికెట్‌ కీపర్‌ సరైన లెంగ్త్‌ గురించి సలహాలు ఇస్తూ ఉంటే.. బౌలర్‌ పని మరింత సులువు అవుతుంది. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. 

మన బౌలింగ్‌లో బ్యాటర్‌ 4-5 బౌండరీలు బాదినపుడు ఏ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయాలన్న విషయంపై సీనియర్ల సలహాలు కచ్చితంగా పనిచేస్తాయి’’ అని బుమ్రా, రాహుల్‌లపై 29 ఏళ్ల సిరాజ్‌ ప్రశంసలు కురిపించాడు. ఇక రెండో రోజు ఏం జరుగుతుందో ఊహించలేమన్న ఈ రైటార్మ్‌ పేసర్‌.. వీలైనంత తక్కువ స్కోరుకు సౌతాఫ్రికాను కట్టడి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు.

ఇప్పటికీ టీమిండియా ఆధిక్యంలోనే ఉంది కాబట్టి రెండో రోజు సానుకూల ఫలితం రాబట్టగలమనే నమ్మకం ఉందని సిరాజ్‌ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏదేమైనా తొలిరోజే న్యూల్యాండ్స్‌ పిచ్‌ నుంచి ఇంత సహకారం లభిస్తుందని అనుకోలేదని, 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదన్నాడు. 

చదవండి: IND vs SA: బాబు అక్కడ ఉన్నది కింగ్‌.. కోహ్లీతోనే ఆటలా! ఇచ్చిపడేశాడుగా

>
మరిన్ని వార్తలు