Ind Vs SA 2nd Test: సిరాజ్‌ 6తో మొదలై 23తో ముగిసె... | IND Vs SA 2nd Test: South Africa 55 All Out In The First Innings, Check Score Details Inside - Sakshi
Sakshi News home page

Ind Vs SA 2nd Test: సిరాజ్‌ 6తో మొదలై 23తో ముగిసె...

Published Thu, Jan 4 2024 4:18 AM

South Africa 55 all out in the first innings - Sakshi

ఒకే రోజు 23 వికెట్లు... ఎన్ని మలుపులు... ఎన్ని అనూహ్యాలు... భారత్‌ టాస్‌ ఓడగానే వెనుకబడిపోయినట్లు అనిపించింది...కానీ మొహమ్మద్‌ సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌ ఆటను మార్చేసింది...అతని పదునైన అవుట్‌స్వింగర్లను తట్టుకోలేక దక్షిణాఫ్రికా కుప్పకూలింది... పునరాగమనం తర్వాత అతి తక్కువ స్కోరుకు ఆలౌటైంది...అనంతరం భారత్‌ వేగంగా పరుగులు సాధించి ముందంజ వేసింది...ఆధిక్యం దాదాపు వందకు చేరింది... కానీ ఇంతలో మరో అడ్డంకి ...ఒక్క పరుగు చేయకుండా చివరి 6 వికెట్లు చేజార్చుకొని టీమిండియా కాస్త డీలాపడింది.

కానీ రెండో ఇన్నింగ్స్‌లో మళ్లీ మన బౌలింగ్‌ చెలరేగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. మొత్తంగా చూస్తే మొదటి రోజు మనదే పైచేయి కాగా...రెండో రోజు సఫారీలను కట్టడి చేస్తే టెస్టు భారత్‌ ఖాతాలో చేరినట్లే!

కేప్‌టౌన్‌: భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికర మలుపులతో సాగి టెస్టు క్రికెట్‌ మజాను పంచింది. బుధవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మొహమ్మద్‌ సిరాజ్‌ (6/15) తన అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడు.

అనంతరం భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. కోహ్లి (46), రోహిత్‌ (39), శుబ్‌మన్‌ గిల్‌ (36) మినహా అంతా విఫలమయ్యారు. జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ‘సున్నా’కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది.
 
టపటపా... 
మ్యాచ్‌కు ముందు రోజు అంచనా వేసినట్లుగానే ఆరంభంలో పేస్‌ బౌలర్లకు పిచ్‌ అద్భుతంగా అనుకూలించడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. సిరాజ్‌ తన రెండో ఓవర్‌ రెండో బంతికి మార్క్‌రమ్‌ (0)ను అవుట్‌ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది.

గత మ్యాచ్‌ స్టార్, కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్న ఎల్గర్‌ (2) కూడా సిరాజ్‌ బంతికే బౌల్డ్‌ అయి నిరాశగా వెనుదిరిగాడు. స్టబ్స్‌ (3)ను వెనక్కి పంపి బుమ్రా కూడా జత కలిశాడు. జోర్జి (2)ని కూడా పెవిలియన్‌ పంపించిన సిరాజ్, ఆ తర్వాత ఒకే ఓవర్లో బెడింగామ్‌ (12), జాన్సెన్‌ (0)ల పని పట్టి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాతి చివరి 4 వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు.  

అదే వరుస... 
యశస్వి జైస్వాల్‌ (0) ఆరంభంలోనే వెనుదిరిగినా రోహిత్, గిల్‌ కలిసి చకచకా పరుగులు రాబట్టారు. దాంతో పదో ఓవర్లోనే భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపించిన బర్గర్‌...శ్రేయస్‌ (0)ను కూడా అవుట్‌ చేశాడు.

అయితే కోహ్లి చక్కటి షాట్లతో స్కోరును వేగంగా నడిపించాడు. మరో వైపు బాగా ఇబ్బంది పడిన రాహుల్‌ (8) తాను ఎదుర్కొన్న 22వ బంతికి గానీ తొలి పరుగు తీయలేకపోయాడు. ఒక దశలో స్కోరు 153/4 వద్ద నిలిచింది. అయితే తర్వాతి 11 బంతులు భారత్‌ను బాగా దెబ్బ తీశాయి. ఈ 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయకుండా జట్టు 6 వికెట్లు కోల్పోవడంతో అదే స్కోరు వద్ద టీమ్‌ ఆలౌట్‌ అయింది.  

స్కోరు వివరాలు:  
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) యశస్వి (బి) సిరాజ్‌ 2; ఎల్గర్‌ (బి) సిరాజ్‌ 4; జోర్జి (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 2; స్టబ్స్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 3; బెడింగామ్‌ (సి) యశస్వి (బి) సిరాజ్‌ 12; వెరీన్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 15; జాన్సెన్‌ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 0; మహరాజ్‌ (సి) బుమ్రా (బి) ముకేశ్‌ 3; రబాడ (సి) శ్రేయస్‌ (బి) ముకేశ్‌ 5; బర్గర్‌ (సి) యశస్వి (బి) బుమ్రా 4; ఎన్‌గిడి (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (23.2 ఓవర్లలో ఆలౌట్‌) 55. వికెట్ల పతనం: 1–5, 2–8, 3–11, 4–15, 5–34, 6–34, 7–45, 8–46, 9–55, 10–55. బౌలింగ్‌: బుమ్రా 8–1–25–2, సిరాజ్‌ 9–3–15–6, ప్రసిధ్‌ 4–1–10–0, ముకేశ్‌ 2.2–2–0–2.  

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: యశస్వి (బి) రబడ 0; రోహిత్‌ (సి) జాన్సెన్‌ (బి) బర్గర్‌ 39; గిల్‌ (సి) జాన్సెన్‌ (బి) బర్గర్‌ 36; కోహ్లి (సి) మార్క్‌రమ్‌ (బి) రబడ 46; శ్రేయస్‌ (సి) వెరీన్‌ (బి) బర్గర్‌ 0; రాహుల్‌ (సి) వెరీన్‌ (బి) ఎన్‌గిడి 8; జడేజా (సి) జాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 0; బుమ్రా (సి) జాన్సెన్‌ (బి) ఎన్‌గిడి 0; సిరాజ్‌ (రనౌట్‌) 0; ప్రసిధ్‌ (సి) మార్క్‌రమ్‌ (బి) రబడ 0; ముకేశ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (34.5 ఓవర్లలో ఆలౌట్‌) 153. వికెట్ల పతనం: 1–17, 2–72, 3–105, 4–110, 5–153, 6–153, 7–153, 8–153, 9–153, 10–153. బౌలింగ్‌: రబడ 11.5–2–38–3, ఎన్‌గిడి 6–1–30–3, బర్గర్‌ 8–2–42–3, జాన్సెన్‌ 9–2–29–0.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 36; ఎల్గర్‌ (సి) కోహ్లి (బి) ముకేశ్‌ 12; జోర్జి (సి) రాహుల్‌ (బి) ముకేశ్‌ 1; స్టబ్స్‌ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 1; బెడింగ్‌హామ్‌ (నాటౌట్‌) 7; మొత్తం (17 ఓవర్లలో 3 వికెట్లకు) 62.  వికెట్ల పతనం: 1–37, 2–41, 3–45.  బౌలింగ్‌: బుమ్రా 6–0–25–1, సిరాజ్‌ 5–2–11–0, ముకేశ్‌ 6–2–25–2.

Advertisement
Advertisement