Ind vs SA: పాట మొదలుకాగానే రాహుల్‌ అలా.. బదులిచ్చిన కేశవ్‌ మహరాజ్‌! వీడియో వైరల్‌

22 Dec, 2023 16:58 IST|Sakshi
రాహుల్- కేశవ్‌ మహరాజ్‌ సంభాషణ (PC: Video Grab LSG X)

KL Rahul-Keshav Maharaj stump-mic chat over 'Ram Siya Ram': టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత జట్టు తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ప్రొటిస్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ జరిగిన సరదా సంభాషణ నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా సిరీస్‌ సొంతం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పర్ల్‌ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది భారత జట్టు.

సంజూ సెంచరీతో
వన్‌డౌన్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ శతకం(108) బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగులు సాధించింది. అయితే, టీమిండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించడంలో సౌతాఫ్రికా తడ‘బ్యా’టుకు లోనైంది. భారత బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ప్రొటిస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 

భారత బౌలర్ల ధాటికి ప్రొటిస్‌ బ్యాటర్లు బెంబేలు
పేసర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ నాలుగు, ఆవేశ్‌ ఖాన్‌ రెండు, ముకేశ్‌ కుమార్‌ ఒక వికెట్‌ తీయగా.. స్పిన్నర్లు వాషింగ్టన్‌ సుందర్‌ రెండు, అక్షర్‌పటేల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. దీంతో 218 పరుగులకే సౌతాఫ్రికా కథ ముగియగా.. 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. మరో వీడియో కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ అందులో ఏముందంటే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ సందర్భంగా 33.2 ఓవర్‌ వద్ద స్కోరు 177 ఉన్నపుడు టెయిలెండర్‌ కేశవ్‌ మహరాజ్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు.

రామ్‌ సీతా రామ్‌
ఆ సమయంలో స్టేడియం వద్ద బోలాండ్‌ పార్కులో.. ‘‘రామ్‌ సియా రామ్‌’’ అంటూ సాగే పాటను ప్లే చేశారు. ఇది విన్న రాహుల్‌ వెంటనే మహరాజ్‌ వైపు చూస్తూ... నువ్వు బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారీ ఇలాగే చేస్తారు కదా అన్న ఉద్దేశంలో నవ్వులు చిందించాడు. ఇందుకు స్పందనగా మహరాజ్‌ సైతం అవును అంటూ నవ్వుతూ క్రీజులో కుదురుకున్నాడు. ఈ మాటలు స్టంప్‌ మైకులో రికార్డయ్యాయి. 

ఇందుకు సంబంధించిన వీడియోను లక్నో సూపర్‌ జెయింట్స్‌.. ‘‘సూపర్‌ జెయింట్స్‌ మధ్య సరదా సంభాషణ’’ అంటూ ఎక్స్‌ వేదికగా షేర్‌ చేసింది. కాగా ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంఛైజీకి రాహుల్‌ కెప్టెన్‌ కాగా.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌(లక్నో)కు కేశవ్‌ మహరాజ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

చదవండి:  టీమిండియాకు షాకులు.. స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లి?


 

>
మరిన్ని వార్తలు