Mansoor Ali Khan: త్రిష, చిరంజీవిపై కేసు.. పబ్లిసిటీ స్టంట్‌ అంటూ కోర్టు ఫైర్‌!

22 Dec, 2023 14:30 IST|Sakshi

మన్సూర్‌ అలీ ఖాన్‌.. కొంతకాలంగా ఈ నటుడి పేరు వార్తల్లో మారుమోగుతోంది. గతంలో తాను ఎన్నో అత్యాచార సీన్లలో నటించానని, లియో మూవీలో కూడా త్రిషతో అలాంటి సీన్‌ ఉంటుందనుకున్నానని, కానీ ఆ సీన్‌ లేకపోవడంతో బాధేసిందంటూ చిల్లర కామెంట్లు చేశాడు. అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారగా త్రిష మన్సూర్‌పై ఫైర్‌ అయింది.

కోటి కావాలంటూ కోర్టుకు..
చిరంజీవి, ఖుష్బూ, చిన్మయి.. తదితర సెలబ్రిటీలు సైతం త్రిషకు మద్దతుగా నిలిచి మన్సూర్‌ వైఖరిని తప్పుపట్టారు. దీంతో త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూపై పరువునష్టం దావా వేశాడు మన్సూర్‌. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని, తనకు ముగ్గురి నుంచి చెరో కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలంటూ పిటిషన్‌ వేశాడు. దీనిపై శుక్రవారం నాడు విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు.. మన్సూర్‌పై మండిపడింది.

పబ్లిసిటీ స్టంట్‌
'ఒక నటిపై మన్సూర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలకుగానూ మిగతా ముగ్గురు నటులు ఆమెకు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. అలాంటి మాటలు మాట్లాడితే ఏ మనిషైనా అలాగే స్పందిస్తాడు. ఈ విషయంలో వారికి వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేసినట్లే ఉంది' అంటూ మన్సూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ సతీశ్‌ కుమార్‌ సదరు పిటిషన్‌ను కొట్టివేశాడు. అంతేకాకుండా తమ సమయం వృథా చేసినందుకుగానూ లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెల్లించాలని మన్సూర్‌ను ఆదేశించాడు.

చదవండి: ఏడాది కింద నటుడితో నిశ్చితార్థం.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పిన బ్యూటీ

>
మరిన్ని వార్తలు