IND vs SA: రోహిత్‌ వ్యాఖ్యలపై ఐసీసీ సీరియస్‌.. చర్యలకు సిద్దం!?

8 Jan, 2024 19:10 IST|Sakshi
రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. తాజాగా కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు అనంతరం క్రికెట్‌ పిచ్‌లపైన రోహిత్‌ చేసిన వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

ఐసీసీ మ్యాచ్ రిఫరీలను ఉద్దేశించి రోహిత్‌ ఘూటు వాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రోహిత్‌ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. హిట్‌మ్యాన్‌పై చర్యలకు సిద్దమైనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

రోహిత్‌ ఏమన్నాడంటే?
కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. దీంతో టెస్టు సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసింది. ఈ క్రమంలో పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో రోహిత్‌ మాట్లాడుతూ.. "ఇది కూడా క్రికెట్‌ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్‌ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా.

మరి దీనికేం రేటింగ్‌ ఇస్తారు? భారత్‌లో ప్రపంచకప్‌ ఫైనల్‌ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్‌ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్‌’ రేటింగ్‌ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి.

కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్‌ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్‌కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్‌ తిరిగితే ఇవేం పిచ్‌లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని రోహిత్‌ పేర్కొన్నాడు.

అయితే ఐసీసీ మాత్రం ఈ విషయంపై  ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న భారత జట్టు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. జనవరి 11న మొహాలీ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.  ఈ సిరీస్‌ కోసం ఇరు దేశాల క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీలు తమ జట్లను ప్రకటించాయి.
చదవండిIND Vs AFG: టీమిండియాలో ఛాన్స్‌ కొట్టేశాడు.. కట్‌ చేస్తే! అక్కడ 6 వికెట్లతో అదుర్స్

>
మరిన్ని వార్తలు