IPL 2024: పొలార్డ్‌ పోస్ట్‌ వైరల్‌.. మళ్లీ రోహిత్‌ శర్మనే దిక్కవుతాడా? | Kieron Pollard Cryptic Post On Loyalty Triggers Mumbai Indians Fans, Know Reason Behind Why - Sakshi
Sakshi News home page

Kieron Pollard Cryptic Post: పొలార్డ్‌ పోస్ట్‌ వైరల్‌.. ముంబైకి మళ్లీ రోహిత్‌ శర్మనే దిక్కవుతాడా?

Published Mon, Jan 8 2024 5:07 PM

Loyalty Ends When: Kieron Pollard Cryptic Post Triggers Mumbai Indians Fans Why - Sakshi

ఐపీఎల్‌-2024కు ముందు కెప్టెన్‌ను మారుస్తూ ముంబై ఇండియన్స్‌ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రోహిత్‌ శర్మనే సారథిగా కొనసాగించాలని అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికీ డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ముంబై జట్టు మాజీ ఆల్‌రౌండర్‌, ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ ఇన్‌స్టా పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది.

విశ్వసనీయత కూడా అంతే.. భారమైపోతుంది
‘‘ఒక్కసారి వర్షం కురిసి వెలిసిపోయాక.. ప్రతి ఒక్కరికి తాము పట్టుకున్న గొడుగు భారంగానే అనిపిస్తుంది. విశ్వాసం కూడా అంతే! ఎప్పుడైతే లబ్ది చేకూరడం ఆగిపోతుందో అప్పుడే విశ్వసనీయత కూడా చెల్లిపోతుంది’’ అన్న అర్థంలో పొలార్డ్‌ ఓ కోట్‌ షేర్‌ చేశాడు. ఇందుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

ముంబై ఇండియన్స్‌ రోహిత్‌ శర్మను కెప్టెన్‌గా తప్పించడాన్ని ఉద్దేశించే పొలార్డ్‌ ఈ పోస్ట్‌ పెట్టాడని హిట్‌మ్యాన్‌ ఫ్యాన్స్‌ భావిస్తుండగా.. రోహిత్‌ తనకు తానుగా తప్పుకొన్నాడు కాబట్టి ఇరు వర్గాలను ఉద్దేశించి పొలార్డ్‌ ఇలా అంటున్నాడని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. 

పాండ్యాను రప్పించి.. కెప్టెన్‌గా నియమించి
కాగా ఐపీఎల్‌-2024 వేలానికి ముందు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ముంబై ట్రేడ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. పాండ్యా కోసం భారీ మొత్తం చెల్లించిన ముంబై.. అతడిని తమ కెప్టెన్‌గా నియమిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఐదుసార్లు ముంబైని చాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మను తప్పిస్తూ.. సారథ్య బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది. 

దీంతో సొంత అభిమానుల నుంచే విమర్శలు ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో భారీ ఎత్తున ఫాలోవర్లను కోల్పోయింది. ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్‌గా నియమితుడైన పాండ్యా గాయం కారణంగా ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

రోహిత్‌ శర్మనే మళ్లీ దిక్కవుతాడా?
ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో రీఎంట్రీ ఇస్తున్న రోహిత్‌ శర్మనే మళ్లీ దిక్కవుతాడా? లేదంటే కొత్త వాళ్లకు పగ్గాలు అప్పగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ ఫ్రాంఛైజీ ఎంఐ కేప్‌టౌన్‌కు కీరన్‌ పొలార్డ్‌ను ముంబై తమ సారథిగా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆదివారం ధ్రువీకరించింది.

Advertisement
Advertisement