IND Vs AUS Finals: గుండె ‘పదకొండు’ ముక్కలు! 

20 Nov, 2023 04:04 IST|Sakshi

ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ పరాజయం

ఆరోసారి విశ్వ విజేతగా ఆస్ట్రేలియా

6 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా

రోహిత్‌ బృందం బ్యాటింగ్‌ వైఫల్యం 

అద్భుత సెంచరీతో ఆసీస్‌ను గెలిపించిన హెడ్‌

భారత్‌ను కట్టడి చేసిన ఆసీస్‌ బౌలర్లు   

నిశ్శబ్దం...నిశ్శబ్దం...నిశ్శబ్దం...నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో!  లక్ష మందికి పైగా మన జనాలు ఉన్న మైదానంలో కూడా నిశ్శబ్దం ఆవరిస్తే  ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేది అక్కడ కనిపించింది... లక్ష మందిని నిశ్శబ్దంగా ఉంచగలిగితే అంతకు మించిన ఆనందం ఏముంటుంది అంటూ మ్యాచ్‌కు ముందు పరిహసించిన కమిన్స్‌ దానిని నిజం చేసి చూపించాడు...

ఆ నిశ్శబ్దం ఒక్కసారి కాదు స్టేడియంలో మళ్లీ మళ్లీ కనిపించింది... దూసుకుపోతున్న రోహిత్‌ అవుటైన క్షణాన... 97 బంతుల పాటు కనీసం ఫోర్‌ కూడా కనిపించని వేళ... కోహ్లిని అవుట్‌ చేసి కమిన్స్‌ సింహనాదం చేసినప్పుడు... ఆ తర్వాత ట్రవిస్‌ హెడ్, లబుషేన్‌ వికెట్ల వద్ద పాతుకుపోయి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వనప్పుడూ అదే నిశ్శబ్దం కనిపించింది. మైదానంలోనే కాదు... దేశంలోని కోట్లాది మంది అభిమానుల ఆశలు, అంచనాలు కూడా తప్పగా మరోసారి గుండెకోతను మిగుల్చుతూ భారత ప్రపంచకప్‌ సమరం ఓటమితో ముగిసింది. 

రోహిత్, కోహ్లి ముఖాల్లో ఎలాంటి భావాలు కనిపించడం లేదు...  కేఎల్‌ రాహుల్‌ మోకాళ్లపై కూర్చుండిపోయాడు... సిరాజ్‌కు కన్నీళ్లు ఆగడం లేదు... బుమ్రాలో నాలుగేళ్ల తర్వాతా మళ్లీ అదే బాధ... ప్రపంచకప్‌ గెలుచుకోవాలని కలగన్న మిగతా ఆటగాళ్ల కళ్ల ముందూ ఒక్కసారిగా శూన్యం  ఆవరించింది... ఎన్ని అద్భుత ప్రదర్శనలు... ఎంత గొప్ప ఆట...

తిరుగులేని బ్యాటింగ్, పదునైన బౌలింగ్‌తో వరుసగా 10 విజయాలు... ఓటమన్నదే  లేకుండా సాగిన ప్రయాణం చివరి మెట్టుపై నిరాశను మిగిల్చింది. లీగ్‌ దశలో టీమిండియా ఆటతీరు చూస్తే కప్‌ ఈసారి మనదే అనిపించగా...

అసలు పోరాటంలో మాత్రం అనూహ్యంగా అడుగులు తడబడ్డాయి... భారతావని క్రికెట్‌ అభిమానులంతా టీమిండియా విజయం కోసం చేసిన పూజలు, మొక్కులు పని చేయక మరోసారి విషాదమే మిగిలింది. పదేళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్‌లేని టీమిండియా బాధ మరికొంత కాలం అందరినీ వెంటాడక తప్పదు.

టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌ ఎంచుకుంది... తీవ్ర ఒత్తిడి ఉండే ఫైనల్లో ముందుగా బ్యాటింగ్‌ చేయడం మంచి అవకాశమే అనిపించింది... రోహిత్‌ దూకుడైన ఆరంభం చూస్తే భారీ స్కోరు ఖాయం అన్నట్లుగా అతని బ్యాటింగ్‌ ధాటి చూపించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది... ఫైనల్‌ మ్యాచ్‌ ఒత్తిడి కనిపించింది...

తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన జట్టు తర్వాతి పదేసి ఓవర్లలో 35, 37, 45, 43 పరుగులే...చివరకు 240 వద్దే ఆట ముగిసింది. అయినా సరే...ఇంగ్లండ్‌తో 229 పరుగులను కాపాడుకోలేదా? సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 213 పరుగులు సాధించేందుకు ఆసీస్‌ తీవ్రంగా ఇబ్బంది పడలేదా?

ఇప్పుడూ సాధ్యమే అనే ఆశ... ఆసీస్‌ 47/3 వద్ద ఆ నమ్మకం పెరిగింది... కానీ ‘హెడ్‌’ను తీయలేక, లబుషేన్‌ను అడ్డుకోలేక ఆ విశ్వాసం ఓవర్లు సాగుతున్నకొద్దీ కరుగుతూ వచ్చింది... చివరకు ఏమి చేయలేని స్థితిలో భారత్‌ ఓటమికి సిద్ధమైంది... 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌కు ప్రతీకారంలా కాకుండా రీప్లేలా 2023 వరల్డ్‌ కప్‌ సినిమా ముగిసింది.   

అహ్మదాబాద్‌: అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన ఆ్రస్టేలియా ఆరోసారి వన్డే క్రికెట్‌లో జగజ్జేతగా నిలిచింది. టోర్నీ ఆరంభ దశలో తడబడి ఆ తర్వాత కోలుకున్న ఆ జట్టు చివరి వరకు అదే పట్టుదలను కనబర్చి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. లీగ్‌ దశలో అజేయంగా నిలవడంతో పాటు వరుసగా 10 విజయాలతో ఊపు మీద కనిపించిన భారత్‌ అసలు పోరులో తలవంచింది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (107 బంతుల్లో 66; 1 ఫోర్‌), విరాట్‌ కోహ్లి (63 బంతుల్లో 54; 4 ఫోర్లు), రోహిత్‌ శర్మ (31 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ఆ్రస్టేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఫైనల్‌’ ట్రవిస్‌ హెడ్‌ (120 బంతుల్లో 137; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగగా, మార్నస్‌ లబుషేన్‌ (110 బంతుల్లో 58 నాటౌట్‌; 4 ఫోర్లు) అండగా నిలిచాడు.

వీరిద్దరు నాలుగో వికెట్‌కు 35.5 ఓవర్లలో 192 పరుగులు జోడించారు. గతంలోఆ్రస్టేలియా 1987, 1999, 2003, 2007, 2015లలో కూడా వన్డే ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచింది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ ఓడిపోవడం ఇది రెండోసారి. 2003 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ ఆస్ట్రేలియా చేతిలోనే భారత్‌ ఓడిపోయింది. 

ఆ్రస్టేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ్రస్టేలియా డిప్యూటీ ప్రధానమంత్రి రిచర్డ్‌ మార్లెస్‌ విన్నర్స్‌ ట్రోఫీని అందజేశారు. విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా జట్టుకు 40 లక్షల డాలర్లు (రూ. 33 కోట్ల 32 లక్షలు), రన్నరప్‌ భారత జట్టుకు 20 లక్షల డాలర్లు (రూ. 16 కోట్ల 66 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.   

రాహుల్‌ అర్ధ సెంచరీ... 
రోహిత్‌ ఎప్పటిలాగే తనదైన శైలిలో దూకుడుగా ఆటను ప్రారంభించాడు. మరో ఎండ్‌లో గిల్‌ (7 బంతుల్లో 4) విఫలమైనా రోహిత్‌ జోరుతో స్కోరు దూసుకుపోయింది. స్టార్క్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో కోహ్లి కూడా ధాటిని చూపాడు. 9 ఓవర్లలో భారత్‌ స్కోరు 66/1. అయితే మ్యాక్స్‌వెల్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్‌ కొట్టిన రోహిత్‌ మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా, హెడ్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు.

తర్వాతి ఓవర్లోనే శ్రేయస్‌ అయ్యర్‌ (3 బంతుల్లో 4; 1 ఫోర్‌) కూడా అవుటయ్యాడు. ఇక్కడి నుంచి భారత్‌ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆసీస్‌ బౌలర్లు మన బ్యాటర్లను పూర్తిగా కట్టిపడేశారు. మెరుగైన ఫీల్డింగ్‌ కూడా ఆ జట్టు అదనపు బలంగా మారింది. కోహ్లి కొంత మెరుగ్గా ఆడినా... రాహుల్‌ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఒకదశలో వరుసగా 26.1 ఓవర్ల పాటు (97 బంతులు) ఒక్క ఫోర్‌ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు! 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తయింది. ఆ వెంటనే కమిన్స్‌ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకొని కోహ్లి నిష్క్ర మించాడు.

కోహ్లి, రాహుల్‌ నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. తడబాటును కొనసాగిస్తూ 86 బంతుల్లో రాహుల్‌ హాఫ్‌ సెంచరీకి చేరగా, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన రవీంద్ర జడేజా (22 బంతుల్లో 9) ప్రభావం చూపలేకపోయాడు. ఆపై వరుసగా వికెట్లు తీసిన ఆసీస్‌ చివరి వరకు ఒత్తిడిని కొనసాగించడంలో సఫలమైంది. 41వ ఓవర్లో స్కోరు 200 పరుగులకు చేరగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 18; 1 ఫోర్‌) కూడా ఆఖర్లో ఏమీ చేయలేకపోయాడు. 

భారీ భాగస్వామ్యం... 
లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా తడబడింది. షమీ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ తొలి బంతికే వార్నర్‌ (3 బంతుల్లో 7; 1 ఫోర్‌) వెనుదిరగ్గా, బుమ్రా బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌) పెవిలియన్‌ చేరాడు. స్టీవ్‌ స్మిత్‌ (9 బంతుల్లో 4; 1 ఫోర్‌)ను కూడా బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో ఆసీస్‌ స్కోరు 47/3... ఇక్కడే భారత బృందంలో చిన్న ఆశ. మరో వికెట్‌ తీస్తే ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేయొచ్చనే వ్యూహం. కానీ హెడ్, లబుషేన్‌ ఆ అవకాశం ఇవ్వలేదు.

హెడ్‌ తన దూకుడును ఎక్కడా తగ్గించకుండా చెలరేగిపోగా, లబుషేన్‌ చక్కటి డిఫెన్స్‌తో బలంగా నిలబడ్డాడు. వీరిద్దరి జోడీని విడదీయడానికి భారత్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. పిచ్‌ జీవం కోల్పోయి బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా మారిపోవడంతో పాటు మన బౌలర్లలో కూడా పదును లోపించింది. దీనిని ఆసీస్‌ ఇద్దరు బ్యాటర్లూ సమర్థంగా వాడుకున్నారు.

ఎక్కడా కనీస అవకాశం కూడా ఇవ్వకుండా వీరిద్దరు లక్ష్యం దిశగా జట్టును నడిపించారు. 95 బంతుల్లోనే హెడ్‌ శతకం పూర్తి చేసుకోగా, 99 బంతుల్లో లబుషేన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. విజయానికి మరో 2 పరుగుల దూరంలో హెడ్‌ అవుటైనా... మ్యాక్స్‌వెల్‌ (2 నాటౌట్‌) లాంఛనం పూర్తి చేశాడు. దాంతో ఆసీస్‌ శిబిరంలో భారీ సంబరాలు మొదలయ్యాయి.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) హెడ్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 47; గిల్‌ (సి) జంపా (బి) స్టార్క్‌ 4; కోహ్లి (బి) కమిన్స్‌ 54; అయ్యర్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) కమిన్స్‌ 4; రాహుల్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) స్టార్క్‌ 66; జడేజా (సి) ఇన్‌గ్లిస్‌ (బి) హాజల్‌వుడ్‌ 9; సూర్యకుమార్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) హాజల్‌వుడ్‌ 18; షమీ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) స్టార్క్‌ 6; బుమ్రా (ఎల్బీ) (బి) జంపా 1; కుల్దీప్‌ (రనౌట్‌) 10; సిరాజ్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్‌) 240. వికెట్ల పతనం: 1–30, 2–76, 3–81, 4–148, 5–178, 6–203, 7–211, 8–214, 9–226, 10–240. బౌలింగ్‌: స్టార్క్‌ 10–0–55–3, హాజల్‌వుడ్‌ 10–0–60–2, మ్యాక్స్‌వెల్‌ 6–0–35–1, కమిన్స్‌ 10–0–34–2, జంపా 10–0–44–1, మార్ష్ 2–0–5–0, హెడ్‌ 2–0–4–0.  

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) కోహ్లి (బి) షమీ 7; హెడ్‌ (సి) గిల్‌ (బి) సిరాజ్‌ 137; మార్ష్ (సి) రాహుల్‌ (బి) బుమ్రా 15; స్మిత్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 4; లబుషేన్‌ (నాటౌట్‌) 58; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (43 ఓవర్లలో 4 వికెట్లకు) 241. వికెట్ల పతనం: 1–16, 2–41, 3–47, 4–239. బౌలింగ్‌: బుమ్రా 9–2–43–2, షమీ 7–1–47–1, జడేజా 10–0–43–0, కుల్దీప్‌ 10–0–56–0, సిరాజ్‌ 7–0–45–1.   

మరిన్ని వార్తలు