అలాంటి వ్యక్తితో  నటించకపోవడం సంతోషం

20 Nov, 2023 04:04 IST|Sakshi

త్రిష

తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ–‘‘నేను గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్లతో బెడ్‌ సీన్లలో నటించా. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో బెడ్‌రూమ్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నాను.

అయితే అలాంటి సన్నివేశం లేకపోవడం బాధపడ్డాను. కశ్మీర్‌ షెడ్యూల్‌ అయిపోయే వరకు త్రిషను చూసే అవకాశం కూడా చిత్రయూనిట్‌ ఇవ్వలేదు’’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలు త్రిష వద్దకు చేరడంతో సోషల్‌ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ‘‘మన్సూర్‌ అలీఖాన్‌ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా.

ఇలాంటి వ్యక్తులతో నటించకపోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ ఆయనతో, అలాంటి వారితో నటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది’’ అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మన్సూర్‌ అలీఖాన్‌ స్పందిస్తూ–‘‘త్రిష అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు.. నా మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు’’ అన్నారు.

మరిన్ని వార్తలు