IND Vs SA: దక్షిణాఫ్రికాలో ల్యాండైన కోహ్లి సేన.. ఫొటోలు షేర్ చేసిన బీసీసీఐ

16 Dec, 2021 22:00 IST|Sakshi

India Tour Of South Africa: ఓ పక్క వన్డే కెప్టెన్సీ అంశంపై దుమారం నడుస్తుండగానే.. కోహ్లి నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికాలో ల్యాండైంది. ఇవాళ ఉద‌యం ముంబై నుంచి ప్రైవేటు విమానంలో జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌కు బ‌య‌ల్దేరిన 18 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన భారత బృందం సాయంత్రానికి అక్క‌డికి చేరుకుంది. సౌతాఫ్రికా విమానం ఎక్క‌డానికి ముందు టీమిండియా ముంబైలోని క్వారంటైన్‌లో మూడు రోజులు గడిపింది. ఆట‌గాళ్ల‌తో పాటు భారత బృందంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌, ఇతర కోచింగ్‌ సిబ్బంది ఉన్నారు. 


విమానంలో జ‌ట్టు ఫొటోను ట్విట్ట‌ర్‌లో షేర్‌ చేసిన బీసీసీఐ.. ఆట‌గాళ్లు జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌ విమానాశ్ర‌యం నుంచి బయటకు వస్తున్న దృష్యాలను కూడా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. కాగా, దక్షిణాఫ్రికాలో క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు పెర‌గుతుండ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం టీమిండియా కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లోనే ఉండ‌నుంది. క్వారంటైన్‌లో ఆట‌గాళ్ల‌కు ప్ర‌తిరోజు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. ఈ నెల 26 నుంచి కేప్‌టౌన్‌ వేదికగా బాక్సింగ్‌ డే టెస్ట్‌ ప్రారంభం కానుంది.
చదవండి: పాక్‌ క్రికెట్‌కు కరోనా కాటు.. మరో సిరీస్ వాయిదా

మరిన్ని వార్తలు