IND Vs ENG 3rd Test Highlights: 434 పరుగుల తేడాతో...

19 Feb, 2024 03:51 IST|Sakshi

ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో భారత్‌ బ్రహ్మాండ విజయం

పరుగుల పరంగా టెస్టుల్లో టీమిండియాకిదే అతిపెద్ద విజయం

యశస్వి అజేయ డబుల్‌ సెంచరీ 

రాణించిన సర్ఫరాజ్, జడేజా

రాంచీలో 23 నుంచి నాలుగో టెస్టు

విరామం తర్వాత మళ్లీ తాజాగా మొదలైన మూడో టెస్టులో యశస్వి జైస్వాల్‌ విధ్వంసం... కొత్త కుర్రాడు సర్ఫరాజ్‌ ఖాన్‌  ప్రతాపం... బౌలింగ్‌లో జడేజా మాయాజాలం... వెరసి భారత్‌ చరిత్రకెక్కే విజయం సాధించింది.

మ్యాచ్‌ మొదలైన రోజు నుంచీ ప్రతీరోజు భారత్‌  ఆధిపత్యమే కొనసాగడంతో ఏ మలుపు లేకుండా ఈ టెస్టు నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టు ఈనెల 23 నుంచి రాంచీలో జరుగుతుంది.   

రాజ్‌కోట్‌: టీమిండియా బలగం ముందు ఇంగ్లండ్‌ ‘బజ్‌బాల్‌’ ఆట కుదేలైంది. మ్యాచ్‌ జరిగే కొద్దీ బ్యాటర్ల పరుగుల పరాక్రమం, బౌలర్ల వికెట్ల మాయాజాలం ప్రత్యర్థి జట్టును చిత్తు చేసింది. మరో రోజు ఆట మిగిలి ఉండగానే ఈ మ్యాచ్‌లో భారత్‌ 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై బ్రహ్మాండ విజయం నమోదు చేసింది.

పరుగుల తేడా పరంగా టెస్టుల్లో భారత జట్టుకిదే అతి పెద్ద విజయం. ఇంతకుముందు భారత జట్టు 2021లో ముంబైలో న్యూజిలాండ్‌పై 372 పరుగుల తేడాతో గెలిచింది. ఆట నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 196/2తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 98 ఓవర్లలో 4 వికెట్లకు 430 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. ఇంగ్లండ్‌కు 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవీంద్ర జడేజా (5/41), కుల్దీప్‌ యాదవ్‌ (2/19), అశ్విన్‌ (1/19) స్పిన్‌ దెబ్బకు ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది.  

యశస్వి ‘డబుల్‌’... 
ఓవర్‌నైట్‌ బ్యాటర్లు శుబ్‌మన్‌ గిల్‌ (91; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుల్దీప్‌ (27; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. గిల్‌ రనౌటయ్యాక శనివారం వెన్నునొప్పితో వ్యక్తిగత స్కోరు 104 పరుగులవద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్‌ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. అదే దూకుడు కొనసాగిస్తూ యశస్వి జైస్వాల్‌ (236 బంతుల్లో 214 నాటౌట్‌; 14 ఫోర్లు, 12 సిక్స్‌లు) తన కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

సర్ఫరాజ్‌ ఖాన్‌ (72 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ప్రస్తుత టెస్టు క్రికెట్లోనే విశేషానుభవజు్ఞడు అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 85వ ఓవర్లో యశస్వి హ్యాట్రిక్‌ సిక్సర్లు అతని విధ్వంసానికి మచ్చుతునకలు కాగా... సర్ఫరాజ్‌ అంతర్జాతీయ టెస్టుకు కొత్తైన... దూకుడు నాకు పాతే అని మరో అర్ధసెంచరీతో నిరూపించుకున్నాడు. 231 బంతుల్లో జైస్వాల్‌ ద్విశతకాన్ని సాధించాడు. ఇద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 172 జోడించడం విశేషం.

స్పిన్‌ ఉచ్చులో పడి... 
కొండత లక్ష్యం కావడంతో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ ఆట చేతులెత్తేసింది. కలిసొచ్చిన స్పిన్‌ పిచ్‌పై జడేజా పట్టు సాధించాడు. ఆరంభంలోనే డకెట్‌ (4) రనౌటయ్యాక, క్రాలీ (11)ని బుమ్రా ఎల్బీగా పంపాడు. తర్వాత జడేజా స్పిన్‌ మాయాజాలంలో పోప్‌ (3), బెయిర్‌స్టో (4), రూట్‌ (7) తేలిగ్గానే పడిపోయారు.

జట్టు స్కోరు 50 వద్దే రూట్‌తో పాటు స్టోక్స్‌ (15), రేహాన్‌ అహ్మద్‌ (0) అవుటయ్యారు. మార్క్‌ వుడ్‌ (15 బంతుల్లో 33; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌ కావడంతో ఇంగ్లండ్‌ 100 పరుగులు దాటింది. అత్యవసర వ్యక్తిగత కారణాలరీత్యా రెండో రోజు ఆట ముగిశాక చెన్నై వెళ్లిన అశ్విన్‌ ఆదివారం మైదానంలోకి దిగి ఒక వికెట్‌ కూడా తీశాడు.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 445;
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 319;
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 430/4 డిక్లేర్డ్‌.
ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 11. డకెట్‌ (రనౌట్‌) 4; పోప్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 3; రూట్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 7; బెయిర్‌స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 4; స్టోక్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్‌ 15; ఫోక్స్‌ (సి) జురేల్‌ (బి) జడేజా 16; రేహన్‌ (సి) సిరాజ్‌ (బి) కుల్దీప్‌ 0; హార్ట్‌లీ (బి) అశ్విన్‌ 16; వుడ్‌ (సి) జైస్వాల్‌ (బి) జడేజా 33; అండర్సన్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్‌) 122. వికెట్ల పతనం: 1–15, 2–18, 3–20, 4–28, 5–50, 6–50, 7–50, 8–82, 9–91, 10–122. బౌలింగ్‌: బుమ్రా 8–1– 18–1, సిరాజ్‌ 5–2–16–0, జడేజా 12.4–4– 41–5, కుల్దీప్‌ 8–2–19–2, అశ్విన్‌ 6–3–19–1.  

వరుస టెస్టుల్లో రెండు డబుల్‌ సెంచరీలు బాదిన మూడో భారత బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌. ఈ వరుసలో వినోద్‌ కాంబ్లి (1993లో), కోహ్లి (2017లో) ముందున్నారు. 

స్వదేశంలో జడేజా అందుకున్న ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డుల సంఖ్య. అనిల్‌ కుంబ్లే (9) పేరిట ఉన్న రికార్డును జడేజా సమం చేశాడు.  

12  ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా అక్రమ్‌  (12 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డును జైస్వాల్‌ సమం చేశాడు.

28 రాజ్‌కోట్‌ టెస్టులో భారత్‌ సిక్స్‌ల సంఖ్య. ఒకే టెస్టులో  అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా 2019లో వైజాగ్‌లో దక్షిణాఫ్రికాపై నమోదు చేసిన రికార్డును భారత్‌ సవరించింది.

48 ఈ సిరీస్‌లో ఇప్పటివరకు భారత జట్టు బాదిన సిక్స్‌లు.  ఇదో కొత్త రికార్డు. దక్షిణాఫ్రికాపై 2019లో భారత్‌  47 సిక్స్‌లు కొట్టింది.

whatsapp channel

మరిన్ని వార్తలు