కెప్టెన్లు జర భద్రం...లేదంటే భారీ మూల్యం

1 Apr, 2021 05:19 IST|Sakshi

లేదంటే భారీ మూల్యం!

స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేస్తే తొలిసారి రూ. 12 లక్షల జరిమానా

రెండోసారి ఉల్లంఘిస్తే రూ. 24 లక్షలు చెల్లించాలి

మూడోసారి పునరావృతం చేస్తే రూ. 30 లక్షలు పెనాల్టీ, మ్యాచ్‌ నిషేధం

ముంబై: ఐపీఎల్‌... ఆటగాళ్లపై కోట్లు కురిపిస్తుంది. స్టేడియంలో మెరుపులు మెరిపిస్తుంది. అభిమానుల్ని మురిపిస్తుంది. ప్రేక్షకుల్ని యేటికేడు అలరిస్తూనే ఉంది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ సీజన్‌లో కెప్టెన్లకు పెద్ద చిక్కే వచ్చిపడింది. ఇక ముందులా తీరిగ్గా బౌలింగ్‌ చేస్తే కుదరదు. నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లను కచ్చితంగా పూర్తిచేయాలి. లేదంటే భారీ మూల్యమే కాదు... డగౌట్‌కు (నిషేధం) పరిమితమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టత ఇచ్చింది.

ఐపీఎల్‌ నియమావళిని అనుసరించి మందకొడిగా (స్లో ఓవర్‌ రేట్‌) బౌలింగ్‌ చేస్తే మొదటిసారి ఆ జట్టు కెప్టెన్‌పై రూ. 12 లక్షలు జరిమానా వేస్తారు. రెండోమారు పునరావృతమైతే రూ. 24 లక్షలు చెల్లించాల్సిందే. అలాగే తుదిజట్టులోని ప్రతి ఆటగాడిపై కూడా రూ. 6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్‌ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా పడుతుంది. ఒకే సీజన్‌లో మూడో సారి కూడా స్లో ఓవర్‌రేట్‌ నమోదు చేస్తే రూ. 30 లక్షలు జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్‌ నిషేధం కూడా విధిస్తారు. అలాగే తుది జట్టు ఆటగాళ్లపై రూ. 12 లక్షలు లేదా 50 శాతం మ్యాచ్‌ ఫీజు (ఏది తక్కువైతే అది) కోతగా విధిస్తారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు