ఐపీఎల్‌ 2021: ముంబైకి అడ్డుందా!

1 Apr, 2021 05:13 IST|Sakshi

ఐపీఎల్‌లో మరో టైటిల్‌ విజయంపై ముంబై ఇండియన్స్‌ దృష్టి

అన్ని రంగాల్లోనూ పటిష్టంగా ఉన్న జట్టు

ఒకటి... రెండు... మూడు... నాలుగు... ఐదు... ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ విజయయాత్ర సాగిపోతూనే ఉంది. తొలి ఐదు సీజన్లలో తమదైన ముద్ర కోసం ప్రయత్నించి విఫలమైన ఆ జట్టు తర్వాతి ఎనిమిది ఏళ్లలో ఏకంగా ఐదుసార్లు టైటిల్‌ గెలిచి సత్తా చాటింది. గత సీజన్‌లో ఆట, జట్టు సభ్యుల తాజా ఫామ్‌ చూసుకుంటే ముంబైని నిలువరించడం ప్రత్యర్థికి మరోసారి అసాధ్యం కావచ్చు. సిక్సర్లతో విరుచుకుపడే హిట్టర్లు, పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేసే బౌలర్లు, మైదానం బయటా హంగామాతో భారీ బడ్జెట్‌ సినిమాను తలపించే టీమ్‌ గత ఏడాది గెలుపుతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. రోహిత్‌ కెప్టెన్సీలో జట్టు దాదాపు ఎలాంటి లోపాలు లేకుండా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అదే జోరును కొనసాగించి ‘సిక్సర్‌’ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. -సాక్షి క్రీడా విభాగం

కొత్తగా వచ్చినవారు
టీమ్‌ అన్ని రకాలుగా కుదురుకొని ఉండటంతో ముంబైకి వేలంలో ప్రత్యేకంగా కొందరు ఆటగాళ్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేకపోయింది. అయితే వేలానికి ముందు విదేశీ పేస్‌ బౌలర్లతో పాటు రాహుల్‌ చహర్‌కు తోడుగా అదనపు లెగ్‌స్పిన్నర్‌ అవసరం కనిపించింది. వేలానికి ముందు తామే విడుదల చేసిన నాథన్‌ కూల్టర్‌నైల్‌ (రూ. 5 కోట్లు)ను మళ్లీ ఎంచుకుంది. కివీస్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్నేపై రూ. 3.20 కోట్లు వెచ్చించిన జట్టు సీనియర్‌ లెగ్‌స్పిన్నర్‌ పీయూష్‌ చావ్లాను రూ. 2.40 కోట్లకు తీసుకుంది. వీరితోపాటు కివీస్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ జట్టులోకి వచ్చాడు. మరో ముగ్గురు వర్ధమాన ఆటగాళ్లు యుధ్‌వీర్‌ చరక్, అర్జున్‌ టెండూల్కర్‌ (భారత్‌), మార్కో జాన్సన్‌ (దక్షిణాఫ్రికా)లను కనీస ధర రూ. 20 లక్షల చొప్పున చెల్లించి జట్టులో భాగం చేసింది. మొత్తంగా చూస్తే హడావిడి పడకుండా టీమ్‌ అవసరాలకు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను మాత్రమే తీసుకోగా, చివరకు రూ. 3.65 కోట్ల స్వల్ప మొత్తమే జట్టు ఖాతాలో మిగిలింది.  

జట్టు వివరాలు
భారత ఆటగాళ్లు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఆదిత్య తారే, అనుకూల్‌ రాయ్, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్, ధావల్‌ కులకర్ణి, హార్దిక్‌ పాండ్యా, ఇషాన్‌ కిషన్, జస్‌ప్రీత్‌ బుమ్రా, జయంత్‌ యాదవ్, కృనాల్‌ పాండ్యా, మొహసిన్‌ ఖాన్, రాహుల్‌ చహర్, సౌరభ్‌ తివారి, సూర్యకుమార్‌ యాదవ్, పీయూష్‌ చావ్లా, యుధ్‌వీర్‌ చరక్, అర్జున్‌ టెండూల్కర్‌.

విదేశీ ఆటగాళ్లు: క్రిస్‌ లిన్, కీరన్‌ పొలార్డ్, క్వింటన్‌ డి కాక్, ట్రెంట్‌ బౌల్ట్, ఆడమ్‌ మిల్నే, నాథన్‌ కూల్టర్‌నైల్, జిమ్మీ నీషమ్, మార్కో జాన్సన్‌
సహాయక సిబ్బంది: మహేలా జయవర్ధనే (హెడ్‌ కోచ్‌), జహీర్‌ ఖాన్‌ (డైరెక్టర్, క్రికెట్‌ ఆపరేషన్స్‌), రాబిన్‌ సింగ్‌ (బ్యాటింగ్‌ కోచ్‌), షేన్‌ బాండ్‌ (బౌలింగ్‌ కోచ్‌), జేమ్స్‌ ప్యామెంట్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌),  

తుది జట్టు అంచనా/ఫామ్‌
గత కొన్నేళ్లుగా ఒకటి, రెండు స్థానాలు మినహా... లేదంటే ఆటగాళ్లు గాయపడితే తప్ప ముంబై ఇండియన్స్‌ తుది జట్టులో ఎప్పుడూ మార్పులు జరగలేదు. అసలు అలాంటి అవసరం కూడా కనిపించలేదు. అంత పక్కాగా ఆ టీమ్‌ కూర్పు, వ్యూహాలు ఉన్నాయి. రోహిత్, డి కాక్, పొలార్డ్, హార్దిక్, కృనాల్, బుమ్రా, బౌల్ట్‌ మరో సందేహం లేకుండా తుది జట్టులో ఉంటారు. ఇక ఇటీవలే భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్‌ కిషన్, సూర్యకుమార్‌ యాదవ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సీజన్‌లోనూ అదరగొట్టిన వీరిద్దరితో కలిపితే తొమ్మిది స్థానాలు ఖాయం. నాలుగో విదేశీ ఆటగాడిగా మిల్నే, కూల్టర్‌నైల్‌లలో ఒకరు ఆడతారు. లిన్, నీషమ్‌లకు అవకాశం దక్కడం చాలా కష్టం. స్పిన్నర్‌గా రాహుల్‌ చహర్‌కు తొలి ప్రాధాన్యత ఉంటుంది కానీ అవసరమైతే చావ్లాను అతనికి బదులుగా వాడుకోవచ్చు. ఆఫ్‌ స్పిన్నర్‌ జయంత్‌కు కూడా కొన్ని మ్యాచ్‌లలో అవకాశం దక్కవచ్చు. ఆరంభ ఓవర్లలో సూపర్‌ బౌలింగ్‌తో బౌల్ట్‌ 2020 విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఇప్పుడు కివీస్‌ తరఫున చక్కటి ఫామ్‌లో ఉండగా... ఇటీవలే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది పొలార్డ్‌ తానేమిటో గుర్తు చేశాడు.

అత్యుత్తమ ప్రదర్శన 5 సార్లు చాంపియన్‌
(2013, 2015, 2017, 2019, 2020)
2020లో ప్రదర్శన: సీజన్‌ మొత్తం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి చివరకు విజేతగా నిలిచింది. లీగ్‌ దశలో 9 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు తొలి క్వాలిఫయర్, ఫైనల్‌లలో అలవోక విజయాలు సాధించింది. ఓడిన ఐదింటిలో కూడా రెండు మ్యాచ్‌లు ‘టై’గా ముగిసినవే. గాయంతో రోహిత్‌ నాలుగు మ్యాచ్‌లకు దూరమైనా జట్టుపై దాని ప్రభావం పడలేదు. ఒకరిని మించి మరొకరు పోటీ పడి అద్భుత ప్రదర్శనతో టీమ్‌కు ఐదో టైటిల్‌ను అందించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు