CSK Vs MI: మహి భాయ్‌ ఉండగా చింత ఎందుకు.. ఇదే నా టాప్‌ ఇన్నింగ్స్‌

20 Sep, 2021 12:46 IST|Sakshi
Photo Courtesy: CSK Twitter

Ruturaj Gaikwad Comments: ‘‘అవును.. ఇప్పటి వరకు నేను ఆడిన ఇన్నింగ్స్‌లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన... ఆరంభంలోనే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం, సీనియర్లు పెవిలియన్‌ చేరడం వంటి అంశాలు.. ఒత్తిడి పెంచడం సహజమే. అయితే, నేను ఆ విషయాన్ని కాసేపు పక్కన పెట్టాను. ఫలితంగా... 130, 140.. ఇలా 150 వరకు స్కోరు చేయగలిగాం’’ అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అన్నాడు. మహి భాయ్‌ మద్దతు ఉంటే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నాడు.

కాగా ఐపీఎల్‌-2021 రెండో దశలో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆరంభంలోనే డుప్లెసిస్‌ (0), రైనా (4) మొయిన్‌ అలీ (0), కెప్టెన్‌ ధోని (3) వెంట వెంటనే అవుట్‌ అయినా పట్టుదలగా నిలబడ్డాడు. జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసి జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 58 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, 4 సిక్స్‌ర్లతో రాణించి 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ధోని సేన 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించగలిగింది.


Photo Courtesy: CSK Twitter

ఇక లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రుతురాజ్‌ మాట్లాడుతూ... తనను ప్రోత్సహిస్తున్న కెప్టెన్‌ ధోని, సీఎస్‌కే యాజమన్యానికి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘మహి భాయ్‌ ఉంటే.. మనం దేని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. నిజానికి ఆరంభంలో బాల్‌ బాగా స్వింగ్‌ అయింది. నేను స్పిన్నర్ల బౌలింగ్‌లో రాణించాలని భావించాను. జడ్డూ వచ్చాక నా ప్రణాళిక చక్కగా అమలు చేసేందుకు వీలైంది’’అని చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలి శ్రీలంక పర్యటనతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన గైక్వాడ్‌.. ఆ టూర్‌ తనకు ఉపయోగపడిందని పేర్కొన్నాడు.

చదవండి: Virat Kohli: అనవసరంగా ఆటగాళ్లపై ఒత్తిడి పెం‍చడమే: గంభీర్‌

మరిన్ని వార్తలు