ఐపీఎల్‌ 2021: తొలి మ్యాచ్‌కే ఇలా అయితే ఎలా?

10 Apr, 2021 17:27 IST|Sakshi
కర్టసీ: ఐపీఎల్ వెబ్‌సైట్

ముంబై:  గత ఐపీఎల్‌ సీజన్‌లానే ఈ ఐపీఎల్‌ సీజన్‌ కూడా సెలబ్రేసన్ప్‌ లేకుండానే ప్రారంభమైంది. అందుకు కారణం కోవిడ్‌ సంక్షోభం. కాకపోతే ఈ ఐపీఎల్‌కు ముందుగానే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సాఫ్ట్‌ సిగ్నల్‌ తొలగింపు, షార్ట్‌ రన్‌పై థర్ఢ్‌ అంపైర్‌ కన్ను, 90 నిమిషాల్లోనే ఒక ఇన్నింగ్స్‌ పూర్తి చేయడం( 20 ఓవర్లు) లాంటి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రూల్స్‌ అన్ని ఈ సీజన్‌ ప్రారంభం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.  ప్రధానంగా మ్యాచ్‌లు అర్థరాత్రి వరకూ వెళ్లకూడదనే ఉద్దేశంతోనే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలనే నిబంధన తీసుకొచ్చింది.  ఇక్కడ స్ట్రాటిజిక్‌ టైమౌట్‌ ఐదు నిమిషాలను కలుపుకుని 90 నిమిషాల్లో ఒక ఇన్నింగ్స్‌ పూర్తి చేయాలనేది బీసీసీఐ ఉద్దేశం. ఒక ఇన్నింగ్స్‌లో రెండు స్ట్రాటిజిక్‌ టైమౌట్‌లు ఉంటే ప్రతీ దానికి రెండున్నర నిమిషాల వ్యవధి ఉంటుంది. 

టైమ్‌కే మ్యాచ్‌ ముగిసిందా?
ఈ ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌-ఆర్సీబీలు ఆడాయి. ఇందులో ఆర్సీబీ 160 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికి ఛేదించి గెలిచింది. కాగా, ఇక్కడ మ్యాచ్‌ ఆరంభం అయిన వద్ద నుంచి చూస్తే నిర్ణీత సమయానికి ముగిసిందా అంటే అది జరగలేదని చెప్పాలి. మ్యాచ్‌ రాత్రి గం. 7.30 ని.లకు ఆరంభమైతే మ్యాచ్‌ ముగిసింది మాత్రం రాత్రి గం. 11.25 నిమిషాల ప్రాంతంలో.  బీసీసీఐ నిబంధన ప్రకారం ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ అనేది గం.9.00లకు ముగియాలి.  అంటే కేవలం గంటన్నర వ్యవధిలో మొదటి ఇన్నింగ్స్‌ను ముగించాలి.  గంటకు సగటును 14 ఓవర్లు వేస్తే గంటన్నరలో తొలి ఇన్నింగ్స్‌ ముగుస్తుంది.

ఆపై ఇన్నింగ్స్‌ బ్రేక్‌(10 నిమిషాలు),  వికెట్లు పడినప్పుడు వచ్చే బ్రేక్‌(రెండు నిమిషాలు)లను తీసేసినా మ్యాచ్‌ మాత్రం అనుకున్న సమయానికి ఎక్కువ పట్టినట్లే అయ్యింది.  గత సీజన్‌లో ఇదే తరహాలో మ్యాచ్‌లు జరిగి ఆలస్యం అయిన కారణంగానే 90 నిమిషాల్లో ఇన్నింగ్స్‌ పూర్తి చేయాలనే బీసీసీఐ కొత్త నిబంధన తీసుకొచ్చింది. మరి ఈ మార్పు ఈ ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో కానరాలేదు.  మ్యాచ్‌ టైమ్‌కే ముగిసిందా.. లేదా అనే వాదన కూడా అభిమానుల్లో వచ్చింది. స్లో ఓవర్‌ రేట్‌పై భారీ జరిమానాలు తీసుకొచ్చినా తర్వాత కూడా తొలి మ్యాచ్‌లోనే ఇలా అయితే ఎలా అని చర్చ మొదలైంది. కాగా,  తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదైనట్లు బీసీసీఐ ప్రకటించకపోవడం గమనార్హం.

స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కొన్ని మ్యాచ్‌లు అనుకున్న సమయం కంటే ఎక్కువసేపు జరిగే అవకాశం ఉండటంతో స్లో ఓవర్‌రేట్ నమోదు చేసే ఆయా జట్లకు బీసీసీఐ దండిగానే జరిమానా విధించనుంది. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఒకజట్టు మొదటిసారి స్లోఓవర్‌ రేటు నమోదు చేస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షల జరిమానా విధించనుంది. రెండోసారి అదే తప్పు చేస్తే.. కెప్టెన్‌కు రూ. 24 లక్షల జరిమానాతో​ పాటు జట్టులోని సభ్యులందరి నుంచి ఫీజులో రూ. 6 లక్షలు లేదా 25 శాతం కోత విధించడం జరుగుతుంది.

ఇక మూడోసారి అదే తప్పు రిపీట్‌ అయితే మాత్రం కెప్టెన్‌కు రూ .30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్‌ ఆడకుండా నిషేదం పడనుంది. దీంతో పాటు జట్టు సభ్యులందరి మ్యాచ్‌ ఫీజులోంచి రూ. 12 లక్షలు లేదా 50శాతం కోత విధించనున్నారు.  కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఏప్రిల్‌ 9న ముంబై ఇండియన్స్‌, ఆర్‌సీబీ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఆరంభం కానుంది.  ఈ భారీ జరిమానాల నేపథ్యంలోనే స్లో ఓవర్‌ రేట్‌ అంశం ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. 

మరిన్ని వార్తలు